సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు లేనివారు ఉండరు. ప్రతి ఒక్కరి లక్ష్యం సక్సెస్సే కాబట్టి.. దర్శకులు, నిర్మాతలు, నటులు ఏదో ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతూనే ఉంటారు. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా హీరోగా రెండు సెంటిమెంట్లు బాగా కలిసి వచ్చాయి. అందులో ఏప్రిల్ సెంటిమెంట్ ఒకటి. అల్లు అర్జున్ నటించిన చిత్రాలు ఏప్రిల్ లో కానుక రిలీజ్ అయితే ఆయనకు హిట్ ఖాయమనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.
ఇప్పటి వరకు ఏప్రిల్ నెలలో బన్నీ, రేసు గుర్రం, S/O సత్యమూర్తి చిత్రాలు విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అలాగే హీరోగా అల్లు అర్జున్ కు కలిసొచ్చిన మరొక సెంటిమెంట్ ఏంటంటే.. వైజాగ్. తన సినిమా షూటింగ్ ను వైజాగ్ లో చేస్తే కచ్చితంగా కలిసి వస్తుందని అల్లు అర్జున్ నమ్ముతాడు.
అల్లు అర్జున్ కెరీర్ లో గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు చిత్రాలు వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. ఈ సినిమాలన్నీ విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చేస్తున్నాడు. పుష్ప 1 పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండో భాగాన్ని డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. అయితే పుష్ప 2 షూటింగ్ కూడా ఇటీవల వైజాగ్ లో జరిగింది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. మరి బన్నీ నమ్ముతున్న వైజాగ్ సెంటిమెంట్ పుష్ప 2కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.