Moviesనాగార్జునకు చెందిన‌ అన్నపూర్ణ స్టూడియోస్ విలువ ఎన్ని వంద‌ల కోట్లో తెలుసా..?

నాగార్జునకు చెందిన‌ అన్నపూర్ణ స్టూడియోస్ విలువ ఎన్ని వంద‌ల కోట్లో తెలుసా..?

భారతదేశంలో ఉన్న‌ ధనిక న‌టుల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక‌రు. ఆయ‌న‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తుల్లో అన్న‌పూర్ణ స్టూడియోస్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావుగారు 1976లో ఈ నిర్మాణ సంస్థ‌ను స్థాపించారు. ఒక‌ప్పుడు సినీ పరిశ్రమ అనగానే మద్రాస్ పేరు వినిపించేది. సినీ రంగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానం మ‌ద్రాసులోనే ఉండేది. అందువ‌ల్ల మ‌ద్రాసు కేంద్రంగా సినిమాల‌ను నిర్మించేవారు. తెలుగు, తమిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల నటులు కూడా మ‌ద్రాసు వెళ్లిపోయి సినిమాలు చేసేవారు.

అయితే 1970లో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం ఉండాలని.. త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన సినీ ప‌రిశ్ర‌మను ఏర్ప‌ర్చుకోవాల‌ని అగ్ర న‌టులంద‌రూ పోరాటం చేశారు. ఈ నేప‌థ్యంలోనే 1973 నాటి సీఎం జలగం చెంగలరావు గారు చొరవ చేసి హైదరాబాద్ లో స్థలం కేటాయించ‌డం జ‌రిగింది. దాంతో ఏఎన్నార్ గారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 22 ఎక‌రాల స్థ‌లంలో స్టూడియోస్ నిర్మించడానికి ఆయ‌న ఎంత‌గానో శ్ర‌మించారు.

ఫైన‌ల్ గా 1976 జనవరి 14న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీద‌గా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభ‌మైంది. మెల్ల మెల్ల‌గా సినిమాల నిర్మాణం ఊపందుకుంది.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయింది. గ‌త కొన్ని ద‌శాబ్దాల నుంచి సినిమాల కోసం అనేక రకాల సేవలను అన్నపూర్ణ స్టూడియోస్ అందిస్తోంది. సెట్ నిర్మాణం, అవుట్‌డోర్ సెట్‌లు, అంతస్తులు, బ్యాక్-లాట్‌లు, డేటా స్టోరేజ్, ఎడిటింగ్, డబ్బింగ్ , సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ ఇంటర్మీడియట్, డాల్బీ విజన్/హెచ్‌డిఆర్, స్టీరియో, నియర్ ఫీల్డ్ మిక్సింగ్, డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్, స్క్రీనింగ్ థియేటర్స్‌ ఇలా ఎన్నో సౌక‌ర్యాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నాయి.

2011లో అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పేరుతో విద్యా సంస్థను కూడా ప్రారంభించింది. ఇక‌పోతే నాగార్జున అధినేత ఉన్న అన్న‌పూర్ణ స్టూడియోస్ విలువ రూ. 600 నుంచి 650 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news