టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్.. ఆ తర్వాత హీరోగా మారాడు. పెళ్లి చూపులు మూవీతో గుర్తింపు తెచ్చుకుని.. అర్జున్ రెడ్డి తో స్టార్ హోదాను అందుకున్నాడు. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల అలరిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ తర్వాత అతని ఫ్యామిలీ నుండి తమ్ముడు ఆనందం దేవరకొండ ఇండస్ట్రీ లోకి వచ్చాడు. హీరోగా సత్తా చాటుతున్నాడు. అయితే విజయ్ దేవరకొండ ఇంతవరకు ఆనంద్‌తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ తన తల్లి మాధవి దేవరకొండతో మాత్రం కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.. డియర్ కామ్రేడ్. అవును మీరు విన్నది నిజమే.
భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. 2019 జూలై 26 తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లతో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి కూడా నటించారు.
బహుశా చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. ఎందుకంటే డియర్ కామ్రేడ్ లో కాలేజీ లెక్చరర్‍గా అతిథి పాత్రలో మాధవి కనిపించారు. చాలా కొద్ది సమయం మాత్రమే ఆమె పాత్ర నిడివి ఉండటం వల్ల ఈ విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు. ఇక నిన్నటితో డియర్ కామ్రేడ్ విడుదలై ఐదేళ్లు.. దీంతో సినిమాకు సంబంధించి అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాధవి దేవరకొండ డియర్ కామ్రేడ్ లో నటించారన్న విషయం నెట్టింట వైరల్ గా మారింది.