మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా 2006 లో రిలీజ్ అయింది. రామ్ చరణ్ కి జోడిగా నేహా శర్మ హీరోయిన్గా కనిపించింది. చిరుత సినిమా రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పెద్ద పండగ వాతావరణం కనిపించింది. చిరంజీవి కొడుకు ఎలా ఉన్నాడో ? ఎలా నటిస్తాడో అసలు సినిమా ఎలా ఉంటుందో ?అని ప్రతి ఒక్కరు ఉత్కంఠతో ఎదురు చూశారు. అందుకే ఈ సినిమా కోసం ముందు రోజు నుంచే థియేటర్లకు పరుగులు పెట్టారు. చాలాచోట్ల అర్ధరాత్రి బెనిఫిట్ షోలు వేశారు. అభిమానులు అయితే అర్ధరాత్రి నుంచి థియేటర్ల దగ్గర హడావుడి చేశారు.
సామాన్యులు మాత్రమే కాదు కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు .. సెలబ్రిటీలు కూడా అర్ధరాత్రి చిరుత సినిమా చూసేందుకు నానా ఇబ్బందులు పడ్డారంట. ఒక హీరో అయితే టిక్కెట్లు దొరకక పక్క ఊరు వెళ్లి మరి ఈ సినిమా చూశానని చెబుతున్నారు. ఆ హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ యాంకర్.. డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్‌బాబు. గతేడాది హిడింబ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో ఇప్పుడు శివం భజే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అశ్విన్.. చిరుత సినిమా రిలీజ్ టైంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం పంచుకున్నాడు.
చిరుత సినిమాకు కాకినాడలో టిక్కెట్స్ దొరకకపోతే తెల్లవారు ఝామునే పిఠాపురం వెళ్లిన ఉదయం 4.30 గంటల షో చూశానని చెప్పారు. ఒకప్పుడు కాకినాడ దగ్గర పిఠాపురం అని చెప్పేవాళ్లు. ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అనే రేంజ్‌కు పిఠాపురం ఇమేజ్‌ను పవన్ కళ్యాణ్ ఎక్కడికో తీసుకువెళ్లి పోయారని అశ్విన్ బాబు తెలిపారు. ఇక తాను కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తినే అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.