తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. అలాంటి కాంబినేషన్లు ఎప్పుడు తెరమీదకు వస్తాయా ? అని ఆ హీరోల అభిమానులు మాత్రమే కాదు.. ఓవరాల్‌గా తెలుగు సినిమా ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబినేషన్‌లో నటసింహం బాలయ్య.. మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ కూడా ఒకటి. సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లాంటి హీరోలకు జోడిగా నటించిన తమన్నా.. నాగార్జునతో కూడా కలిసి తెరపంచుకుంది. ఒక బాలయ్యతో మాత్రం ఇప్పటికీ నటించలేదు.
భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో తమన్నాతో ఒక ఐటెం సాంగ్ చేయించాలని అనుకున్నారు. అయితే అది ఎందుకో సాధ్యం కాలేదు. నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య, తమన్నా కాంబినేషన్‌లో ఎప్పటికీ సినిమా వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఒకానొక దశలో తమన్నా కూడా బాలయ్యతో ఒక సినిమా చేయాలని ఎంతో ఆశపడిన మాట వాస్తవం. అయితే బాలయ్య పక్కన తమన్నా నటించక పోయినా.. నందమూరి హీరోలు ఎన్టీఆర్‌కు జోడిగా ఊసరవెల్లి సినిమాలోను.. కళ్యాణ్ రామ్ జోడీగా నా నువ్వే సినిమాలోను నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఓ విధంగా చెప్పాలంటే నందమూరి హీరోలకు తమన్నా పెద్దగా కలిసి రాలేదు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత తమన్నాను రిపీట్ చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. ఇక బాలయ్య ఇప్పుడున్న ఫామ్‌లో తమన్నాకు అవకాశం ఇస్తారనుకోవటం కల. తమన్నా మాత్రం బాలయ్య అంటే తనకు ఎంతో గౌరవం అని.. బాలయ్యతో సినిమా చేయాలని ఉందని.. చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక చిరంజీవితో ఆమె నటించిన సైరా, భోళాశంకర్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లు అయ్యాయి. ఇటీవల కాలంలో తమన్నా సక్సెస్ రేట్ కూడా తగ్గింది. తెలుగులో ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు కూడా లేవు. ఈ లెక్కన చూస్తే బాలయ్య, తమన్నా కాంబినేషన్‌లో సినిమా రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి.