టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ?చెప్పక్కర్లేదు. బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది. అటు వెండితెర మీద.. బాలయ్య నటిస్తున్న సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఇటు బుల్లితెర మీద బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో సైతం దుమ్ము రేపుతోంది. బాలయ్య వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హిట్ అవడంతో.. కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో తన కెరీర్‌లో 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక బాలనటుడిగా తన తండ్రితో కలిసి నటన మొదలుపెట్టిన బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో కూడా కొన్ని సినిమాలలో నటించారు. వాటిలో ఒకటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ టైటిల్ పాత్ర పోషించగా.. బాలయ్య ఆయన శిష్యుడు సిద్ధప్ప పాత్రలో నటించారు. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. కమర్షియల్‌గా అప్పట్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు రూ.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాలను కట్ చేయాలని అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో రిలీజ్ ఆపేసిన ఎన్టీఆర్.. తన ప్రభుత్వం వచ్చాక విడుదల చేస్తానని చెప్పి అలాగే విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లోనే ఎన్టీఆర్.. బాలయ్యకి దర్శకత్వం ఎలా ఉండాలో ?నేర్పించారట. షార్ట్ మేకింగ్ ఎలా చేయాలి ? కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలి అనే విషయంపై కూడా బాలయ్యకు ఎన్టీఆర్ అవగాహన కల్పించారట. అలాగే కొన్ని సనివేశాలకు బాలయ్య స్వయంగా కెమెరామేన్‌గా పనిచేశారు. అలా బాలకృష్ణ కెరీర్‌లో కెమెరామేన్‌గా పనిచేసిన ఏకైక సినిమా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వ ప్రతిభను అప్పటి సినీ విశ్లేషకులు ఎంతో మెచ్చుకున్నారు.