ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ – నీతా అంబానీ ఆఖరి పుత్రుడు అనంత్ అంబానీ నేడు రాధిక మర్చంట్ ను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో కనీ వినీ ఎరుగుని రీతిలో వీరి పెళ్లి జరగబోతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఇవాళ ప్రారంభమైన అనంత్-రాధిక పెళ్లి వేడుకలు మూడు రోజులు సాగనున్నాయి. జులై 13న శుభప్రదమైన ఆశీర్వాదం, 14న వివాహ రిసెప్షన్, ఆఖరి రోజు మంగళ ఉత్సవ్ నిర్వహించబోతున్నారు.
అంబానీ ఇంట పెళ్లి వేడుకకు మన దేశానికి చెందిన వ్యాపార, క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి నటీనటులు, పాప్ సింగర్స్, రాజకీయ నాయకులు సైతం తరలివస్తున్నారు. దీంతో ముంబై నగరమంతా కోలాహాలం నెలకొంది. ఎక్కడ చూసినా సెలబ్రిటీల హడావుడియే కనిపిస్తోంది. అనంత్-రాధిక పెళ్లికి దాదాపు 2500 మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారిని తరలించేందుకు ముకేష్ అంబానీ మూడు ఫాల్కన్ 2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నారు.
అతిథులందరికీ తమ స్థాయికి తగ్గటుగానే సత్కారాలు చేస్తున్నారు. స్వాగతం పలికినప్పటి నుంచి వీడ్కోలు చెప్పే వరకు ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వివాహానికి హాజరైన అతిథుల కోసం కోట్ల విలువైన రిటర్న్ గిఫ్టులను కూడా ప్లాన్ చేశారు. వీవీఐపీ అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లో గడియారాలు ఇస్తున్నారట. ఒక్కో గడియారం ఖరీదు కోట్లలో ఉంటుందట. ఇతర అతిథులకు కశ్మీర్, రాజ్ కోట్, బెనారస్‌ల నుంచి ఆర్డర్ చేసిన గిఫ్ట్‌లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇక అనంత్, రాధిక వెడ్డింగ్ మెనూ కూడా చాలా ప్రత్యేకం. అతిథుల కోసం ఏకంగా 2500కు పైగా వంటకాలను మెనూలో చేర్చారు. అంతర్జాతీయ చెఫ్‌లు పిలిపించి వంటలు వండిస్తున్నారు. 100కిపైగా వంటకాలను ఇండోనేషియా క్యాటరింగ్ కంపెనీల చేత తయారు చేయిస్తున్నారు. అనంత్-రాధిక రాయల్ వెడ్డింగ్ బడ్జెట్ రూ. 4,000-5,000 కోట్ల మధ్య ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి.