నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాలలో ఆదిత్య 369 ఒకటి. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 33 సంవత్సరాలు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఒకరోజు సింగీతం.. టైం మిషన్ అనే నవల చదివి ఆ నవల స్ఫూర్తితో సినిమా తీయాలని స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. భూతకాలంలోకి వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటికి వెళ్లాలని ఆయన అప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
ఇక మద్రాసులోని అమెరికా లైబ్రరీకి వెళ్లి భవిష్యత్తులో నగరాలు, పట్టణాలు అన్ని భూమి లోపల ఉంటాయన్న కథను సిద్ధం చేసుకున్నారు. అలా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను కలిపి కథ రాసుకున్నారు. ఒకానొక టైంలో సింగీతం.. ఈ కథను ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రకు బాలయ్య అయితే బాగుంటుందని అనుకున్నారు. హీరోయిన్గా విజయశాంతి పేరు పరిశీలించారు. ఆ టైంలో ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో.. మోహినీని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారు.
అలాగే శాస్త్రవేత్త పాత్ర కోసం బాలీవుడ్ నటుడు టిను ఆనంద్‌ను తీసుకున్నారు. మరో పాత్రకు సిల్క్ స్మితను ఎంపిక చేసి నటింపచాశారు. టైమ్ మిషన్ సన్నివేశాల కోసం మద్రాస్ లోని వాహినీ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేసి అక్కడ చిత్రీకరించారు. ఈ సినిమాకి ముందుగా కాలయంత్రం అనే టైటిల్ అనుకున్నారు. ఆ టైటిల్ తో పాటు పలు రకాల టైటిల్స్ పరిశీలించారు. చివరికి ఆదిత్య 369 టైటిల్ ఫిక్స్ చేశారు. రూ.1.60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమా వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ కల్కి సినిమాకు సింగీతం శ్రీనివాసరావు మెంటార్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.