కళా తపస్వి కే. విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా తెలుగు ప్రేక్షకుల మన్ననలే కాదు.. భాష తెలియని వారికి సైతం.. కనుల విందు చేసింది. అనేక భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేశారు. కొన్నింటిలో అయితే కథ కొని.. తిరిగి నిర్మించుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు కథ మాత్రమే కాదు.. తెలుగులో అయితే.. పాటలు ఇప్పటికీ వినిపించేలా ఉంటాయి. మరికొన్నేళ్లయినా.. అలానే ఉంటాయి కూడా!
అయితే.. ఈ సినిమాలో జరిగిన చిత్రమైన ఘటన గురించి ఓ సందర్భంలో పాటల రచయిత వేటూరి సుందరరామమూర్తి వివరించారు. ఈ సినిమాకు పాటలు రాయడానికి ముందు ఆయన రెండు వ్యాంపు పాటలు రాస్తున్నారు. ఓ సుబ్బారావు.. ఓ అప్పారావు.. ఎవరో ఎవరో వస్తారంటే.. అనే పాటతోపాటు.. నువ్వడిగింది ఏనాడైనా కాదనన్నానా? అనే పాటను కూడా రాస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే విశ్వనాథ్‌గారు ఫోన్ చేసి శంకరాభరణం సినిమాకు పాటలు రాయాలని అన్నారు. అదేముంది.. సాధారణమే కదా..అని అనుకున్న వేటూరి ఓకే చెప్పారు. కానీ, అడ్వాన్సు పుచ్చుకుని.. రంగంలోకి దిగిన తర్వాత.. చుక్కలు కనిపించాయట. ఏ పాట రాసినా.. విశ్వనాథ్ చింపేసేవారట. అయ్యో నాకు వేరే దానికి వాడుకుంటానని చెప్పినా.. ఆయన వినిపించుకోకుండా.. వాటిని బుట్టదాఖలు చేసేవారట. దీంతో ఏకాగ్రత కోసం హిమాలయాలకు వెళ్లి వచ్చారట వేటూరి. (ఈ ఖర్చు సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భరించారని చెప్పారు)
అక్కడి నుంచి తిరిగి వచ్చాక మొత్తం పాటల్లో ఒక్కటి మినహా అన్నీ నెల రోజుల్లోనే పూర్తి చేసేశారు. ప్రతిపాటా.. విశ్వనాథ్ కళ్లకు అద్దుకుని చిత్రీకరించారట. అయితే.. చివరగా ఒక పాట మిగిలిపోయింది. దానికి ఎలా మొదలు పెట్టాలో కూడా వేటూరికి తెలియలేదు. కానీ, సినిమాలో హైలెట్ సాంగ్.. చిత్రం ఆ పాటతో ముగిసిపోతుంది కూడా. ఇదే విషయంపై తర్జన భర్జన పడ్డారు. ఓ రాత్రి విందు అనంతరం.. కారులో వెళ్తున్న వేటూరి.. అదుపుతప్పి ప్రస్తుతం ఓల్డ్ సచివాలయం ఉన్న చోట పెద్ద చెట్టును ఢీకొట్టారు.
దీంతో ఆయన రెండు కాళ్లు కొంత దెబ్బతిన్నాయి. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఇక, ఆయనను చూసేందుకు వచ్చిన విశ్వనాథ్… ఏదీ.. కాళ్లకు ఏమైంది.. అంటూ.. పట్టుకున్నారట. అయితే.. విశ్వనాథ్ తనకన్నా ఎక్కువ వయసు కావడంతో వద్దన్నారట వేటూరి. కానీ, విశ్వనాథ్ మాత్రం `దొరకునా ఇటువంటి సేవ అంటూ.. ఆయన పాదాలు వత్తారట. అంతే! అదే చరణంతో అక్కడే బెడ్ మీద పాట పూర్తి చేసేసి ఇచ్చారట వేటూరి. అదే సినిమాలో చివరి సాంగ్. తర్వాత.. మాటలు కూడా ఉండవు. అది ఇప్పటికీ సూపర్ హిట్టే..!