Moviesవైసీపీ ఓడే సీట్ల‌న్నీ బీసీల‌కే... టీడీపీ కంచుకోట‌ల్లో బీసీ మ‌హిళ‌లు... నిజ‌మైన...

వైసీపీ ఓడే సీట్ల‌న్నీ బీసీల‌కే… టీడీపీ కంచుకోట‌ల్లో బీసీ మ‌హిళ‌లు… నిజ‌మైన ప్రేమ బాబుదా.. జ‌గ‌న్‌దా..!

బీసీలు అంటే తెలుగుదేశం.. తెలుగుదేశం అంటేనే బీసీలు.. ఎంతోమంది బీసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన వారు.. ఆ వ‌ర్గాల్లో నిరుపేద‌ల‌ను రాజ‌కీయ నాయ‌కుల‌ను చేసి.. వారికి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంప‌డంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జ‌డ్పీచైర్మ‌న్లను చేసిన ఘ‌న‌త టీడీపీదే. నాడు ఎన్టీఆర్‌, ఆ త‌ర్వాత ఎంతోమంది బీసీ నేత‌ల‌ను త‌యారు చేశారు. టీడీపీ అంటేనే ఓ బీసీ లీడ‌ర్ల ఖార్ఖానా. ఇది ప‌క్క‌న పెడితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎంతో మంది బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చాం.. చంద్ర‌బాబు కంటే ఎక్కువ మందికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చామంటూ డ‌ప్పు కొట్టుకుంటూ వ‌స్తున్నారు.

తాజాగా జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తోన్న అభ్య‌ర్థుల ఎంపిక‌ల్లోనూ బీసీలే ఎక్కువ మంది ఉంటున్నారు. వాస్త‌వంగా ఒక్క‌టి గ‌మ‌నిస్తే జ‌గ‌న్ త‌న సొంత జిల్లాతో పాటు.. వైసీపీ కంచుకోట‌లు అయిన రాయ‌ల‌సీమ‌, నెల్లూరు లాంటి జిల్లాల్లో బీసీల‌కు ఒక‌టి, అరా త‌ప్పా సీట్లు ఇవ్వ‌డం లేదు. పార్టీ గెలిచే సీట్ల‌న్నీ త‌న సొంత రెడ్డి సామాజిక వ‌ర్గానికే క‌ట్ట‌బెడుతూ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌కవ‌ర్గాలే బీసీల‌కు ఇస్తున్నారు. మైల‌వ‌రంలో తిరుప‌తిరావు యాద‌వ్, పెడ‌న‌లో జోగి ర‌మేష్‌, రేప‌ల్లెలో ఈపూరు గ‌ణేష్‌, క‌నిగిరిలో నారాయ‌ణ‌రావు యాద‌వ్‌, కందుకూరులో అర‌విందా యాద‌వ్‌, ఏలూరు పార్ల‌మెంటులో సునీల్‌కుమార్‌, విశాఖ పార్ల‌మెంటు నుంచి బొత్స ఝాన్సీ, రాజ‌మండ్రి, న‌ర‌సాపురం పార్ల‌మెంటుల్లో గూడూరి శ్రీనివాస్‌, గూడూరి ఉమాబాల పేరుకు మాత్ర‌మే బీసీల‌కు సీట్లు ఇచ్చాన‌ని చెపుతున్నా.. వీరిలో చాలా మంది ఆయా క‌మ్యూనిటీల్లో తెలియ‌ని వారే ఉన్నారు.

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ఒక్క బీసీ సీటు లేదు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో ఒక్క బీసీకీ సీటు లేదు. న‌ర‌సారావుపేట పార్ల‌మెంటు సీటు బీసీల‌కు ఇచ్చాన‌ని చెపుతున్నా అక్క‌డ అసెంబ్లీ సీట్లు అన్నీ అగ్ర‌వ‌ర్ణాల‌కే క‌ట్ట‌బెట్టి రెడ్డి ఆధిప‌త్యం ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు జ‌గ‌న్‌. మ‌రి జ‌గ‌న్ ఇలా చేస్తుంటే చంద్ర‌బాబు మాత్రం పార్టీకి కంచుకోట‌లుగా ఉన్న సీట్ల‌ను బీసీల‌కు ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో 23 సీట్లు వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా ఇప్పుడు బీసీల‌కు.. అందులోనూ బీసీల్లో వెన‌క‌ప‌డిన ర‌జ‌క కులానికి చెందిన ఓ మ‌హిళ‌కు ఇచ్చే ఆలోచ‌న చేయ‌డ‌మే బీసీల‌పై చంద్ర‌బాబుకు నిజ‌మైన ప్రేమ ఉంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

గ‌ల్లా మాధ‌వికి ల‌క్‌…?
ఆ మ‌హిళ ఎవ‌రో కాదు.. గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ త‌ర‌పున బ‌లంగా రేసులో ఉన్న బీసీ మ‌హిళ గ‌ల్లా మాధ‌వి. గుంటూరు వెస్ట్ సీటు టీడీపీకి కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ ఆ పార్టీ ఏకంగా 12 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక్క‌డ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారిపోగా ఇప్పుడు ఈ సీటు కోసం టీడీపీలో గ‌ట్టి పోటీ ఉంది. రాజ‌ధాని ప్ర‌భావం.. పైగా పార్టీకి కంచుకోట‌.. బ‌ల‌మైన కులాల స‌పోర్ట్ అందుకే ఇక్క‌డ టీడీపీ సీటు కోసం క‌మ్మ‌, కాపు, బీసీల‌తో పాటు జ‌న‌సేన నేత‌లు కూడా పోటీ ప‌డుతున్నారు. పైగా వైసీపీ నుంచి చిల‌క‌లూరిపేట నుంచి వ‌ల‌స వ‌చ్చిన మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ పోటీలో ఉన్నారు.

ర‌జనీ చిల‌క‌లూరిపేట‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. అక్క‌డ ఆమె ఓడిపోతుంద‌ని తెలిసే జ‌గ‌న్ ఆమెను వెస్ట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. అయితే ఇక్క‌డ ఆమెకు ఈక్వేష‌న్లు కుద‌ర‌క‌, పార్టీలో కీల‌క నేత‌ల స‌హకారం లేక‌.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తీవ్రంగా ఎదుర్కొంటూ చివ‌ర‌కు భారీగా డ‌బ్బు వెద‌జ‌ల్లుతూ పార్టీ కార్య‌క్ర‌మాలు ర‌న్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. పైగా రాజ‌ధాని మార్పు ప్ర‌భావంతో గుంటూరు న‌గ‌రంలో సీటు గెలుచుకోవ‌డం టీడీపీకి మ‌రింత స‌వాల్‌గా మారింది. ఇలాంటి చోట చంద్ర‌బాబు బీసీల్లో బాగా వెన‌క‌ప‌డిన ర‌జ‌క వ‌ర్గం నుంచి.. అందులోనూ ఓ మ‌హిళ‌కు సీటు ఇవ్వ‌డం అంటే చంద్ర‌బాబుకు బీసీల ప‌ట్ల నిజంగా ఉన్న ప్రేమ స్ప‌ష్ట‌మ‌వుతుండ‌గా… అదే టైంలో జ‌గ‌న్ బీసీల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు మారుస్తూ… వారిని త‌న రాజ‌కీయ స్వార్థానికి వాడుకుంటూ ఎలా బ‌లి ప‌శువులను చేస్తున్నాడో పై ఉదాహ‌ర‌ణ‌లే బెస్ట్ ఎగ్జాంపుల్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news