నాగభూషణం.. అంటే విలనీ పాత్రలకు పెట్టింది పేరు. ఆయన అసలు పేరు ఎలా ఉన్నా.. ఏదైనా కూడా.. రక్తకన్నీరు నాటకాలతో ప్రసిద్ధి చెందారు. దీంతో రక్తకన్నీరు నాగభూషణం అనే పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. ఆయన సినిమాల కంటే కూడా నాటకాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. దీంతో ఆయన గ్యాప్ దొరికినప్పుడల్లా తెనాలి నాటకాల ట్రూపులతో కలిసి.. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో నాటకాలు వేసేవారు. ఇప్పటికీ రాజమండ్రిలో నాగభూషణం నెలకొల్పిన నాటక సంస్థ ఉంది. అప్పుడప్పుడు ఈ సంస్థ నాటకాలు వేస్తూనే ఉంది.
అయితే.. సినిమా రంగంలోకి వచ్చాక నాగభూషణం తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందరిలాగానే ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. తొలి నాళ్లలో ఒకటి రెండు వేషాలు వేశాక.. ఆయనకు బోర్ కొట్టింది. ఎందుకంటే..బాగా గ్యాప్ వచ్చేసింది. దీంతో సినిమాల్లోకి ఏం వెళ్తాంలే అబ్బా.. అని అనేవారట. అయితే.. అనూహ్యంగా ఆయనకు అన్నగారి నుంచి కబురు వచ్చింది.
అప్పట్లో ఫోన్లు కూడా ఉండేవి కాదు. అన్నగారు లేఖ రాశారు. తమ్ముడు నాగభూషణానికి..అని మొదలు పెట్టి.. తను తీస్తున్న ఒక సినిమాలో వేషం ఇస్తామని పిలిచారు. దీంతో మళ్లీ నాగభూషణం సర్కార్ ఎక్స్ప్రెస్(కాకినాడ-మద్రాస్ మధ్య తిరిగేది) ఎక్కడి చెన్నై వెళ్లారు. ఇలా.. ఆయన మూడో చిత్రం భట్టి విక్రమార్కతో ప్రారంభమైంది. ఈ సినిమాలో మూడే సీన్లు ఉంటాయి. కానీ, వేదాంతం రాఘవయ్య దర్శకుడు కావడంతో నాగభూషణం దశ తిరిగింది.
ఆ సినిమాకే ఆయన తొలి పారితోషికం అందుకున్నారు. అప్పటికి జీతాల ప్రస్తావన ఉన్నా.. అంజలీదేవి నటి కావడంతో ఆమె జీతాలు ఏం సరిపోతాయంటూ.. పారితోషికాలు ఇచ్చేవారు. ఇలా నాగభూషణానికి రోజుకు 200 చొప్పున ఇచ్చారట. ఈ సినిమాలో మాంత్రికుడి శిష్యుడిగా ఆయన చేశారు. ఈ సినిమా హిట్టయిన తర్వాత.. ఇక నాగభూషణం బిజీ అయిపోవడం గమనార్హం.