సినీ పరిశ్రమలో కొందరు హీరోలు చేయాల్సిన సినిమాలు మరో హీరో చేసి హిట్లు.. లేదా ప్లాపులు కొడుతూ ఉంటారు. ఒక హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి హిట్టు కొడితే వదులుకున్న హీరో బ్యాడ్‌లక్ అంటారు. అదే ఆ హీరో వదులుకున్న సినిమా మరో హీరో చేసి ప్లాప్ కొడితే.. వదులుకున్న హీరో గుడ్‌లక్ అంటూ ఉంటారు. ఇలాగే నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయాలనుకున్న ఓ సినిమా విక్టరీ వెంకటేష్ చేయడం.. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం జరిగాయి.
1990వ దశకంలో బాలయ్య, వెంకటేష్ ఇద్దరూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పరుచూరి సోదరులు, యాక్షన్ సినిమాల దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. కథ కూడా రెడీ అయ్యింది. కోలీవుడ్లో చిన్న తంబి అనే సినిమా పి. వాసు దర్శకత్వంలో వచ్చింది. ఆ సినిమా చూసిన గోపాల్.. ఈ సినిమా చూశాను బాగుంది.. మీరు కూడా చూడండి.. బాలయ్య చేస్తే బాగుంటుందన్నారట.
వెంటనే పరుచూరి సోదరులు చిన్న తంబి సినిమా చూసి ఈ సినిమా బాలయ్యతో చేస్తే సూపర్ హిట్ అవుతుందనుకున్నారట. ఈ సినిమా రైట్స్ కొనే విషయంలో ఆలస్యం జరిగింది. అప్పటికే ఈ రైట్స్ క్రియేటివ్ కమర్షియల్ అధినేత కేఎస్ రామారావు కొనేసి వెంకటేష్ హీరోగా సినిమా తీసేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. ఆ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఆ సినిమాయే చంటి.
చంటి సినిమా వెంకీ కెరీర్‌లో ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో చూశాం. నిజం చెప్పాలంటే వెంకటేష్ కెరీర్‌ను టాలీవుడ్‌లో తిరుగులేని విధంగా మార్చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా మీనా హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్ అమాయకపు నటనకు ఆంధ్రదేశం అంతా నీరాజనాలు పలికింది. ఆ రోజుల్లో ఈ సినిమా సెంటిమెంట్ ఆంధ్రదేశపు మహిళలను కంట తడి పెట్టించేసిది. అప్పట్లోనే చంటి 40 + కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.