టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు ఇండియన్ సినిమాకే పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి 1,2 త్రిబుల్ ఆర్ సినిమాల దెబ్బతో రాజమౌళి సినిమా అంటేనే పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. తన గురువు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెగాఫోన్ పట్టి 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అస్సలు ఒక్క ప్లాప్ అన్నది లేకుండా దూసుకుపోతున్నాడు.
తనను ఇంత పెద్ద డైరెక్టర్‌ను చేసిన తన గురువుకు ఓ రుణం తీర్చుకోవాలని… అందుకోసం ఓ సినిమా కూడా చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. అయితే ఆ కోరిక తీరలేదు. రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి ప్రకాష్‌ను హీరోగా పెట్టి రాఘవేంద్రరావు నిర్మాణంలో.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నరు. అయితే ఆ సినిమా మిస్ అయ్యింది. ఈ సినిమాపై 4 నెలల పాటు రాజమౌళి వర్క్ చేశాడు.
అప్పటి స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఆర్తీ అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్‌ను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే బ్రేక్ పడింది. సింహాద్రి తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత కోవెలమూడి ప్రకాష్ జాన్ మహేంద్రన్ అనే దర్శకుడి దర్శకత్వంలో నీతో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బొమ్మలాల, అనగనగా ఓ ధీరుడు సినిమాతో డైరెక్టర్‌గా కూడా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు.
చివరగా అనుష్క ప్రధాన పాత్రలో సైజ్ జీరో సినిమా చేసినా అది కూడా సక్సెస్ కాలేదు. చివరగా ప్రకాష్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తీసిన సినిమా కూడా సక్సెస్ కాలేదు.