టాలీవుడ్‌లో సంక్రాంతికి మూడు, నాలుగు పెద్ద సినిమాలు ఎప్పుడూ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ యేడాది నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది ఇప్పుడే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తూనే వస్తోంది. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏ హీరో సినిమా విజయం సాధిస్తుంది.. ఏ హీరో పై చేయి సాధిస్తాడు ? అనే ఆసక్తి ఎప్పుడూ తెలుగునాట ఉంటుంది. అయితే రెండు దశాబ్దాల క్రితం ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు సహజంగానే ఆ హీరోల అభిమానుల మధ్య వార్ ఉంటుంది.
ఇప్పుడు నడుస్తోంది సోషల్ మీడియా యుగం. అప్పట్లో సోషల్ మీడియా లేదు. కానీ పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు అభిమానులు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు మా హీరో సినిమాయే సూపర్ హిట్ అంటూ చర్చల్లో ఉండేవారు. టాలీవుడ్‌లోనే ఓ సంక్రాంతికి చరిత్రలో నిలిచిపోయే వార్ జరిగింది. ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలు అప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. అదే 2001 సంక్రాంతి.
బాలయ్య – బి.గోపాల్ నరసింహానాయుడు, చిరంజీవి – గుణశేఖర్ మృగరాజు, విక్టరీ వెంకటేష్ – కోడి రామకృష్ణ దేవిపుత్రుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. చూడాలని ఉంది లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన మృగరాజుపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవి తర్వాత కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన దేవీపుత్రుడు మీద అంతే అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాపుల్లో ఉన్న బాలయ్య నరసింహానాయుడు సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి.
బాలయ్య సినిమాకు పెద్దగా థియేటర్లు కూడా దక్కలేదు. జనవరి 11న మృగరాజు, నరసింహానాయుడు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. జనవరి 14 దేవీపుత్రుడు రిలీజ్ అయ్యింది. మృగరాజుకు తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ముందు నరసింహానాయుడు యావరేజ్ అన్నారు. దేవీపుత్రుడు కూడా దేవిస్థాయి అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత నరసింహానాయుడు జనాలకు బాగా ఎక్కేసింది. సమరసింహారెడ్డిని మించి బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
అలా ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలు చిరు, బాలయ్య, వెంకీ పోటీపడిన ఆ సంక్రాంతికి బాలయ్య నరసింహానాయుడు తిరుగులేని బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఈ మూడు సినిమాల రిలీజ్‌కు ముందు నాటి ఆంధ్రదేశం అంతా ఆయా హీరోల అభిమానుల మధ్య పెద్ద చర్చలు, మాటల యుద్ధాలు జరిగాయి.