పరిచయం :
మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కాంబినేష్ లో వచ్చిన అతడు థియేటర్ లలో సోసో అనిపించినా టీవీలో మాత్రం ఈ సినిమాకు చాలామంది ఫిదా అయ్యారు. అతడు తరవాత వీరిద్దరి కాంబోలోనే ఖలేజా సినిమా వచ్చింది. ఇక ఖలేజా అయితే థియేటర్లో ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా కూడా టీవీలో ప్రేక్షకులను మెప్పించింది. ఈ రెండు సినిమాలలో త్రివిక్రమ్ రాసిన డైలాగులు..మహేశ్ బాబు చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకర్శించింది. ఇక వీరి కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ మహేశ్ కాంబోకు క్రేజ్ ఉండటం…గుంటూరు కారం టైటిల్ తో మాస్ మసాల సినిమా అని అనిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను గుంటూరు కారం రీచ్ అయ్యింది లేదా అన్నది రివ్యూలో చూద్దాం…
కథ :
వసుంధర రమ్యకృష్ణ. రాయల్ సత్యం జయరామ్ ల కొడుకు రమణ తన మేనత్త బుజ్జి ఈశ్వరిరావు దగ్గర చిన్నప్పటి నుండి పెరుగుతాడు. వసుంధర రెండో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతుంది. వసుంధర తండ్రి వెంకటస్వామి తన కూతురు రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకుంటాడు. ఈ నేపథ్యంలోనే తన వసుంధర కొడుకు, భర్త ఆమె రాజకీయజీవితానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని భావిస్తాడు. అంతే కాదు తల్లి నుండి కొడుకును పూర్తిగా దూరం చేయాలని రమణతో ఓ అగ్రిమెంట్ పై సంతకం చేయించాలని ప్రయత్నిస్తాడు.
అంతే కాకుండా వసుంధర రెండో భర్త కుమారుడిని ఆమె రాజకీయవారసుడిని చేయాలని అనుకుంటాడు. కానీ రమణకు తల్లి అంటే చాలా ఇష్టం..ఆమెను వదులుకోవాలని అనుకోడు. ఈ క్రమంలో రమణ అగ్రిమెంట్ పై సంతకం చేశాడా..? అసలు రమణ తల్లి దండ్రులు ఎందుకు విడిపోయారు..? భర్తతో విడిపోయినప్పటికీ కన్న కొడుకును కూడా వసుంధర ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనేదే గుంటూరు కారం కథ.
విశ్లేషణ :
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సింపుల్ కథలో హిట్ కొట్టడం అలవాటే. అత్తారింటికి దారేది సినిమాలో కేవలం అత్తను వెనక్కి తీసుకురావడం అనే కాన్సప్ట్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక గుంటూరు కారం కథ కూడా అలాంటిదే..అక్కడ అత్త సెంటిమెంట్..ఇక్కడ తల్లి సెంటిమెంట్ మిగితాదంతా సేమ్ టూ సేమ్. కానీ ఇక్కడ త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. కొడుకు సంతకంతో తెగిపోయే బంధం నేపథ్యంలనే కథ సాగుతుందని ఆదిలోనే అర్థం అయిపోతుంది.
ఆ తరవాత సీన్లన్నీ రెండు గంటలు ప్రేక్షకుడికి ఏదో చూపించాలి కాబట్టి తీసినట్టు ఉంటాయి. సినిమాలోని పాత్రలకు..వచ్చే సన్నివేశాలకు అసలు సంబంధమే ఉండదంటే త్రివిక్రమ్ ఏ రేంజ్ లో ఫ్లాప్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కథలో తల్లి సెంటిమెంట్ కీలకం…వారిద్దరి భావోద్వేగాలపైనే సినిమా ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఆ సీన్లు కూడా పండించలేకపోవడం సినిమాకే అతిపెద్ద మైనస్ అయ్యింది. సినిమా ఫస్ట్ హాఫ్ గుంటూరు నుండి హైదరాబాద్ కు వెళ్లడమే సారాంశం అన్నట్టుగా ఉంటుంది.
ఇక మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్లు, శ్రీలీల గ్లామర్ తప్ప సినిమాలో మరేం కనిపించదు. ఇక సెకండాఫ్ కూడా అర్థమయ్యి..అర్థం కానట్టే ఉంటుంది. ప్రకాష్ రాజ్ చేసే రాజకీయం అసలుకే అర్థం కాదు. కేవలం రమణతో సంతకం చేయిస్తే భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రావా..? ఏంటి ఈ సిల్లీ పాయింట్ అని సగటు ప్రేక్షకుడు తలపట్టుకునే పరిస్థితి. కామన్ గా త్రివిక్రమ్ అంటేనే మాటల మాంత్రికుడు..కానీ ఈ సినిమా తరవాత ఆ పేరు కూడా పోయేలా ఉంది. తద్దినం జన్మదినం రెండూ దినాలే…ఇది గుంటూరు కారం డైలాగ్..ఇలాంటి డైలాగులెన్నో సినిమాలో ఉన్నాయి. వాటిని చూసినప్పుడు అసలు త్రివిక్రమే డైలాగులు రాశాడా అని అనుమానాలు కూడా రాకపోవు. ఈ చిత్రానికి మహేశ్ బాబు చేసే హంగామా..కొన్ని కామెడీ సీన్లు, పాటలు శ్రీలీల స్టెప్పులు మాత్రమే బలం.
ఫైనల్‌గా
గుంటూరు కారం ఘాటు లేని కారం