టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నిర్మాతగా మంచి ఫాంలో ఉన్నప్పుడు తీసిన సినిమా అసెంబ్లీ రౌడీ. టాలీవుడ్‌లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించగా చంద్రముఖి చిత్రాన్ని తెరకెక్కించిన పి.వాసు ఈ అసెంబ్లీరౌడీ మాతృకకు కథ అందించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు అందించిన ఈ సినిమాకి కెవి.మహదేవన్ మ్యూజిక్ అందించగా ఈ సినిమాను మోహన్‌బాబు తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ చేశారు. మోహన్‌బాబు సొంత మండలం ఏర్పేడు కూడా చాలా వరకు షూటింగ్ జరిగింది. శ్రీకాళహస్తీలో తీసిన అందమైన వెన్నెలలోనా పాటకే మోహన్ బాబు చాలా ఖర్చు చేశారు. ఇక ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ షేక్ అయింది. దాంతో మోహన్ బాబుకి ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల దెబ్బకు కలెక్షన్ కింగ్ అన్న బిరుదు వచ్చేసింది. ఈ సినిమాకి హీరోయిన్ దివ్యభారతి బాగా ప్లస్ అయింది.
ఈ సినిమా హిట్ అయ్యాక తెలుగులో ఆమెతో సినిమాలు తీసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆమె వెంటపడ్డారు. ఈ సినిమా వచ్చిన నెక్ట్స్ ఇయర్‌లో.. ఇదే మోహన్‌బాబు – దివ్యభారతి కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు అనే సినిమాను తీశారు. ఇది కూడా తమిళ రీమేక్..కథ మీద అంత నమ్మకం లేదు… దీంతో మోహన్‌బాబు ఈ సినిమా నిర్మాతగా లేరు. అయితే పి.శ్రీధర్ రెడ్డి నిర్మించారు. జస్ట్ నిర్మాత మాత్రమే మారాడు తప్ప మిగిలిన యూనిట్ అంతా సేమ్ టు సేమ్.
అయితే అసెంబ్లీ రౌడీలో దివ్య భారతిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చిట్టెమ్మ మొగుడులో చాలా వ్యతిరేకించారు. చిట్టెమ్మ పాత్రలో దివ్య భారతి బాగా నటించినా ప్రేక్షకులు చూడలేకపోయారు. అప్పట్లో మోహన్ బాబు అండ్ టీం కేవలం దివ్య భారతి కోసమే చిట్టెమ్మ మొగుడు సినిమాను తీసి నిర్మాతకి నష్టాలు రావడానికి కారణమయ్యారనే టాక్ టాలీవుడ్లో బాగా నడిచింది. ఈ సినిమాతో నిర్మాత ఆర్థికంగా చాలా నష్టపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో ఒక్కో సినిమా చేసిన దివ్య భారతి మోహన్ బాబుతో మాత్రం రెండు సినిమాలు చేసిన రికార్డు దక్కించుకుంది.