తాజాగా సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్‌బాబు మరో రెండున్నర మూడేళ్ల వరకు తెరమీద కనిపించేది డౌటే. ఎందుకంటే మహేష్‌బాబు – రాజమౌళి సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మహేష్.. రాజమౌళి సినిమా కోసం జాయిన్ అయ్యాడంటే కనీసం రెండేళ్ల పాటు మరే ప్రాజెక్టు చేసేందుకు వీలుండదు. అయితే మిగిలిన దర్శకుల సంగతి ఎలా ? ఉన్నా టాలీవుడ్లో దర్శకధీరుడు రాజమౌళిది ఓ సెపరేట్ స్కూలు.
ఆయనతో సినిమా అంటే హీరోలు ఎంత ఉత్సాహం చూపించారో.. అంత కంట్రల్లో ఉండాలి. సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేవరకు రాజమౌళి ఆధీనంలోనే ఉండాలి. ఇదే ఇప్పుడు మహేష్‌ను బాగా ఇబ్బంది పెట్టేస్తోందట. మహేష్ ఓ సినిమా షూటింగ్ జరుగుతుంటే రెండు రోజులు గ్యాప్ వస్తే చాలు విదేశాలకు చెక్కేస్తాడు. ఫ్యామిలీతో సహా వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఇక మార్చి నుంచి మహేష్ పూర్తిగా రాజమౌళి ఆధీనంలోకి బందీగా వెళ్లిపోవాలి. మధ్యలో మహేష్ లుక్స్ ఏవీ కూడా బయటకు వస్తే ఊరుకోనని రాజమౌళి ఇప్పటికే మహేష్‌కు చెప్పేశాడట. అంటే మరో రెండేళ్ల పాటు సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు అస్సలు మహేష్ బయటకు రాలేని పరిస్థితి. విదేశాలకు కూడా వెళ్లకూడదు. అంటే నమ్రత, తన ఫ్యామిలీతో కలిసి విదేశీ ట్రిప్‌లు రెండేళ్ల వరకు ఎంజాయ్ చేయలేని పరిస్థితి. పైగా మహేష్ చాలా బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు.. ఇకపై రెండేళ్ల వరకు వాటిని కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి.
అస్సలు షూటింగ్ పూర్తయ్యేంత వరకు మహేష్‌కు సంబంధించి చిన్న లుక్ కూడా బయటకు రాకూడదు అన్నది రాజమౌళి కండీషన్. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ పూర్తిగా కొత్తగా ఉండబోతోందట. లుక్ కోసమే ఏకంగా నెల రోజుల పాటు టెస్ట్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. పాత్రకు అనుగుణంగా మహేష్ తన లుక్‌ను మార్చుకుంటున్నాడట. ఈ సినిమాకు సంబంధించి చిన్న విషయం కూడా రాజమౌళి చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నాడు.