టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు. గుంటూరు కారం రిలీజ్ అయిపోయింది. ఇక మళ్లీ మహేష్‌బాబును వెండితెర మీద కనీసం రెండున్నరేళ్ల తర్వాతే చూస్తాం.
దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమా షూటింగ్ కనీసం రెండు సంవత్సరాలు పడుతుందంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నాక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు రెండున్నర సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.
ఈ పాన్ వరల్డ్ గ్లోబల్ ప్రాజెక్టుపై కొత్త అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిఫ్ట్ లాక్ అయ్యిందని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. మరో అప్‌డేట్ ఏంటంటే ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కేఎల్. నారాయణ నిర్మిస్తారు. ఎప్పుడో సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యాక రాజమౌళికి తన బ్యానర్లో సినిమా చేయాలని కేఎల్. నారాయణ భారీ అడ్వాన్స్ ఇచ్చారు.
అందుకోసమే ఇన్నేళ్లకు ఇప్పుడు రాజమౌళి కేఎల్. నారాయణకు సినిమా చేస్తున్నారు. ఆయన సినిమాలు తీయడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద ప్రాజెక్టును నారాయణ హ్యాండిల్ చేయలేరన్న సందేహాలు కూడా ఉన్నాయి. ముందుగా ఈ ప్రాజెక్టులోకి భాగస్వామిగా ఎంటర్ అయ్యేందుకు ఒక టాలీవుడ్ అగ్రనిర్మాత ట్రై చేశారు. అయితే ఇప్పుడు ఓ హాలీవుడ్ సంస్థను పార్ట్‌నర్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.