ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ నుంచి చాలా ఆసక్తితో వెయిట్ చేస్తోన్న సినిమా హనుమాన్. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ సజ్జ – దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. తెలుగులో సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీలో కూడా డేర్‌గా ఈ సినిమాను రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ ఎంత వరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
సౌరాష్ట్రలో ఉండే మైఖేల్(వినయ్ రాయ్) తన చిన్ననాటి నుంచి సూపర్ హీరోస్ విషయంలో ఉత్తేజితుడు అయ్యి తాను కూడా అలా సూపర్ హీరో కావాలనుకుంటాడు. అటు అంజనాద్రి అనే ఓ చిన్న గ్రామంలో చిన్న చిన్న దొంగతనాలు చేసే తుంటరి కుర్రాడు హనుమంతు (తేజ సజ్జ) కొన్ని కారణాలతో భజరంగ్ హనుమాన్ శక్తులు పొందుతాడు. హనుమంతు ఈ శక్తులు ఎలా ? పొందాడు ? అసలు ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది ? ఈ శక్తి గురించి తెలుసుకున్న మైఖేల్ ఏం చేశాడు ? అప్పుడు యుద్ధం ఎలా ఉంటుంది? దీనికి భారతదేశ ఇతిహాసాలకు ఉన్న లింక్ ఏంటన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమాకు హనుమంతుడే పెద్ద ప్లస్. ఆ ఫ్యాక్టర్‌ను సినిమాలో ఎలా హైలెట్ చేయాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. అసలు సినిమాలో ఈ పాత్రను చూస్తుంటే పూనకాలతో పాటు తెలియని కొత్త ఎమోషన్, ఇటు భక్తిభావం అన్ని వచ్చేస్తుంటాయి. హీరో తేజ సజ్జా అయితే ఈ పాత్రకు ప్రాణం పెట్టేశాడు. తన లుక్స్, కామెడీ టైమింగ్ అదిరిపోయింది. యాక్షన్ పార్ట్, ఎమోషనల్ పార్ట్ పెర్పామెన్స్‌తో అదరగొట్టాడు.
హీరోయిన్ అమృత అయ్యర్ కూడా ఈ సినిమాలో మంచి పాత్రలో నటించింది. హీరోతో ట్రావెల్ చేస్తూ బ్యూటిఫుల్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. వీరితో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్లో నటించింది. ఆమె నటన చాలా నేచురల్‌గా ఉంటుంది. తేజతో ఎమోషనల్ సీన్లలో ఇద్దరి పెర్పామెన్స్‌లు అదిరిపోయాయి. సముద్రఖని రోల్ చాలా షాకింగ్‌గా ఉంటుంది. విలన్ వినయ్‌రాయ్ చాలా క్లీన్‌గా కనిపిస్తాడు. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య వారిపై కామెడీలు హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి.
సినిమాలో రోమాలు నిక్క పొడుచుకుని చూసే సీన్లు చాలానే ఉన్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో చాలా మూమెంట్స్ అదరగొడతాయి. ఇక టోటల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే మరో బిగ్గెస్ట్ హైలెట్.. ఆఖరు 20 – 25 నిమిషాలు అయితే చాలా ఉత్కంఠ, థ్రిల్లింగ్‌తో ఉంటుంది. ఓవరాల్‌గా ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
తక్కువ బడ్జెట్‌తో ఇంత గొప్ప క్వాలిటీ గ్రాఫిక్స్‌తో ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మను నిజంగానే అభినందించాలి. శివేంద్ర సినిమాటోగ్రఫి బాగుంది. భారీ విజువల్స్ చక్కగా ప్రజెంట్ చేశారు. గౌరీ హరీష్ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్. తన నేపథ్య సంగీతంతో బ్యాక్‌బోన్‌గా నిలిచాడు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. డైలాగులు సూపర్‌గా ఉన్నాయి. సూపర్ హీరో జానర్ అయినా… ప్రస్తుత కాలానికి మన ఇతిహాసాన్ని జోడించడంలో మాత్రం తాను సూపర్ సక్సెస్ అయ్యాడు.
ఫైనల్‌గా…
ఫైనల్‌గా తెలుగు నుంచి వచ్చిన ఈ సూపర్ హీరో సినిమా “హనుమాన్” పెట్టుకున్న అంచనాలు రీచ్ అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాతో థియేటర్లలో పూనకాలు తెప్పించి.. వీరంగం ఆడించేశాడు. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు థియేటర్లకు వెళ్లి మరీ ఎంజాయ్ చేయాల్సిన సూపర్‌మ్యాన్ సినిమా హనుమాన్.
హనుమాన్ రేటింగ్ : 3.5 / 5