టాలీవుడ్ యంగ్ టైగర్ – ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తయారవుతున్న సినిమా దేవర. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా మేకర్స్ దేవర మార్కెటింగ్ మొదలుపెట్టారు.
ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. నైజాం భేరసారాలు మొదలయ్యాయి. ఓవర్సీస్ డీల్ ను రు. 27 కోట్ల మేరకు క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ సినిమాగా చూసుకుంటే ఇది కాస్త పెద్ద మొత్తమే. అయితే ఇప్పుడు దేవర సినిమాకు ఉన్న బజ్‌తో పాటు సినిమాలు హిట్ అయితే ఓవర్సీస్ లో వస్తున్న కలెక్షన్లు చూసుకున్న ఈ టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టం కాదు. హనుమాన్ లాంటి చిన్న సినిమాలే హిట్టు టాక్ తెచ్చుకుని అక్కడ ఏకంగా ఐదు మిలియన్ డాలర్ల క్లబ్‌లో పడ్డాయి.
ఇక నైజాం విషయానికి వస్తే నిర్మాతలు 45 నుంచి 50 కోట్ల రేంజ్ లో రేటు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాను రు. 45 కోట్లకు దిల్ రాజు కొనుక్కున్నారు. ఆ సినిమాకు నైజం వరకే 10 కోట్ల మేర నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది. ఇక దేవర నైజాం రైట్స్ మైత్రి సంస్థకు ఇస్తారా ? శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ శిరీష్‌రెడ్డి, దిల్ రాజుకు ఇస్తారా అన్నది తేలలేదు. దేవర తొలిభాగం మార్కెట్ దాదాపు 150 నుంచి 200 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు భారీగా ఖర్చు చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలు. ఎన్టీఆర్ కి జోడిగా దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోందిజ జాన్వీకపూర్ కు తెలుగులో మాత్రమే కాదు.. సౌత్ ఇండియాలోనే అన్ని సినిమా భాషలలో ఇదే తొలి సినిమా కావటం విశేషం.