ఏ ప్రభుత్వం అయినా రిటైర్మెంట్ ఇచ్చేది వయసుకే కానీ మనసుకు కాదు. 60 ఏళ్ళు దాటితే ఇక పని అయిపోయిందన్నట్టుగా మనలో చాలామంది టెన్షన్.. అందుకనే పెన్షన్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే భవిష్యత్తులో ఇక పెన్షన్లు ఉండవు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పటికీ యాక్టివ్గా ఉండాలి. మనకు నచ్చిన పని చేసుకుంటూ పోవాలి. జీవితంలో 60 దాటాక రెండో బ్రేక్ రావచ్చు. కానీ.. మనం ఎప్పుడూ చూడనంత మరింత ఎత్తుకి ఎదగొచ్చు అన్నది నటసింహం నందమూరి బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి. ఈ విషయంలో చాలా రంగాల్లో చాలామంది ఆదర్శంగా ఉంటారు.
అయితే బాలకృష్ణ వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా తయారవుతున్నారు. మరింత కుర్రాడిగా మారిపోతున్నారు. ఆయన యంగ్ ఎనర్జీ.. టాలీవుడ్ కుర్ర హీరోలకు సైతం షాక్‌లు ఇస్తోంది. బాలకృష్ణ కెరీర్ అయిపోయింది.. ఆయనలో వృద్ధాప్య ఛాయలు వచ్చేసాయి.. కెరీర్ కష్టం అనుకుంటున్న తరుణంలో అందరికీ దిమ్మతిరిగే షాక్‌లు ఇస్తున్నాడు. 2021లో అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా చేసి ఒక్కసారిగా జూలు విదిల్చాడు. ఆ సినిమాలో బాలయ్య నట విశ్వరూపంతో పాటు అఘోరా పాత్ర చూసిన తెలుగు సినీ జనాలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.
ఇటు బుల్లితెరపై అన్‌స్టాపుల్ టాక్ షో ఒంటిచేత్తో బ్లాక్ బస్టర్ హిట్ చేసి.. తాను వెండితెర హీరోనే కాదు.. బుల్లితెరపై తనకు సాటి వచ్చే టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరూ లేరు అని ప్రూవ్ చేసుకున్నారు. కచ్చితంగా ఆటిట్యూడ్‌తో కూడిన పాపులారిటీలో బాలయ్యకు సాటి రాగల స్టార్ హీరో కానీ, కుర్ర హీరో కానీ ఒక్కడు కూడా టాలీవుడ్‌లో లేడని చెప్పాలి. అస్సలు అలుపు లేకుండా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ పోతున్నారు. ఈ యేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.
ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. బాలయ్య స్టామినా ఏ రేంజ్ లో ఉందో చాటి చెప్పింది. ఇక దసరాకు భగవంత్ కేసరి సినిమాతో మరో పెద్ద హిట్ కొట్టి సూపర్ అనిపించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రానుంది. ఏది ఏమైనా బాలయ్య జోరు ముందు ఎవరైనా బేజారు అనక తప్పదు అన్నట్టుగా ఆయన దూసుకుపోతున్నారు.