తనదైన హాస్యంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం.. నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్ హోదా అనుభవించారో, ఎంతటి డబ్బుతో తులతూగారో.. చివరి రోజుల్లో పద్మనాభం అంత పేదరికంలో బతికారు. చివరకు ఆయన పరిస్థితి చాలా దిగజారింది. ఆయన మంచితనమే ఆయనకు శత్రువుగా మారిందని, పద్మనాభం మిత్రులు అంటుంటారు.
చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకురావాలంటే లౌక్యం అవసరం. అదిలేక చిత్తూరు నాగయ్య వంటి గొప్ప నటులు ఇబ్బందులు పడ్డారు. ఈ కోవలో పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో ‘సినిమా వైభవం’ చిత్రం తీసిన ఆయన దీని కోసం ఓ వ్యక్తి వద్ద రూ.60 వేలు అప్పుచేశారు. అందుకు హామీగా దేవత, పొట్టి ప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, శ్రీరామకథ సినిమాల నెగటివ్‌లను తాకట్టు పెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు ఆయన పరమవుతాయని ఒప్పందం చేసుకున్నారు.
గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్రా, నైజాం ఏరియాలకు రూ.3 లక్షలకు అమ్మేశారు. పద్మనాభం ఇవ్వాల్సి అప్పు తీరగా, మిగతా చాలా డబ్బే మిగింది. దాదాపు రెండు లక్షలు. అయితే.. దీనిలో చిల్లిగవ్వకూడా పద్మనాభానికి ఇవ్వలేదు. పైగా సినిమా నెగెటివ్‌లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ, పద్మనాభానికి న్యాయం జరగలేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో పద్మనాభం చాలా చితికిపోయి.. చివరి రోజుల్లో చిన్నా చితకా పాత్రల కోసం ఎదురు చూశారు.