‘ సలార్ ‘ సినిమాలో వరదరాజమన్నార్‌గా విలన్ పాత్రలో నటించిన పృధ్విరాజ్ సుకుమారన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. ఎన్నో ఏళ్లుగా మలయాళ సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్. తన కెరీర్‌లో ఎక్కువగా మలయాళ సినిమాలలోనే నటించాడు. అందుకే మలయాళ సినీ ప్రేక్షకులకు పృథ్వీరాజ్ బాగా పాపులర్. పృథ్విరాజ్ 24 ఏళ్లు ఉన్నప్పుడే వాస్తవం అనే సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు.
డిగ్రీ చదువుతున్న టైంలోనే ఒక అడిషన్లో పాల్గొని నందనం అనే సినిమాలో నటించడానికి ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా 2002లో రిలీజ్ అయింది. పృథ్వీరాజ్ హీరోగా మారటానికి కారణం ప్రముఖ మలయాళ దర్శకుడు ఫాజిల్. పృథ్వికి నందనం సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేసింది కూడా ఫాజిల్. అప్పటికి పృథ్వి వయసు కేవలం 19 సంవత్సరాలు. దర్శకుడు సంతోష్ శివన్‌తో కలిసి 2011లో ఉరిమి అనే సినిమా నిర్మించారు.
అప్పట్లో మలయాళం లోనే రెండో భారీ బడ్జెట్ సినిమాగా ఉరిమి నిలిచింది. 2019లో మెగాఫోన్ పట్టి మోహన్‌లాల్ హీరోగా.. లూసిఫర్ అనే సినిమాను డైరెక్ట్ చేసి తాను మల్టీ టాలెంటెడ్ హీరో అని నిరూపించుకున్నాడు. ఈ సినిమా 21 రోజుల్లో రూ.150 కోట్లు సాధించి అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన మలయాళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇక పృథ్వీరాజ్ పెళ్లి చాలా ఆసక్తిగా జరిగింది.
బీబీసీ ఇండియాలో రిపోర్టర్ గా పనిచేసిన సుప్రియ మీనన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన క్రమంలో సుప్రియతో ప్రేమలో పడిన పృథ్వీరాజ్ 2011 ఏప్రిల్ 25న పాలక్‌కాడ్‌లో బంధుమిత్రుల సమక్షంలో ఆమెను పెళ్లాడారు. 2014లో ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది.