Moviesపల్లెటూరు రూ.10 టికెట్.. 101 రోజులు.. రూ.11 లక్షలు బాలయ్య దమ్ము...

పల్లెటూరు రూ.10 టికెట్.. 101 రోజులు.. రూ.11 లక్షలు బాలయ్య దమ్ము అంటే ఇది.. !

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో సెన్సేషనల్.. బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఈ రెండు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నరసింహనాయుడు సినిమా దక్షిణ భారత దేశ సినీ చరిత్రలో తొలిసారిగా 100 కేంద్రాలలో వంద రోజులు ఆడిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. 22 సంవత్సరాల క్రితం ఈ సినిమా 105 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సిమ్రాన్, ఆశాసైనీ, ప్ర‌తిజింగానియా హీరోయిన్లుగా నటించారు.

విజయవాడకు చెందిన శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్ పై మేడికొండ వెంకటరమణ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా 2001 సంక్రాంతి బరిలో నిలిచి తిరుగులేని ఘన విజయం సాధించింది. నరసింహనాయుడు దెబ్బతో దేవి పుత్రుడు, మృగరాజు సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. నరసింహనాయుడు ఆ రోజుల్లోనే 100 కేంద్రాలలో వంద రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అంతకుముందు ఈ రికార్డు బాలయ్య సమరసింహారెడ్డి పేరిట ఉండేది.

సమరసింహారెడ్డి 77 కేంద్రాల్లో వంద రోజులు ఆడితే.. తన రికార్డును బాలయ్య తానే తిరగరాసుకుని 105 కేంద్రాల్లో సెంచరీ కొట్టాడు. పశ్చిమగోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన కామవరపుకోట పల్లెటూరు. 20 సంవత్సరాల క్రితం ఇలాంటి పల్లెటూర్లలో సినిమా రిలీజ్ చేయటం పెద్ద సాహసం. అయితే నరసింహనాయుడు సినిమాను రిలీజ్ చేయాలని కామవరపుకోట లోని శ్రీలక్ష్మి టాకీస్ థియేటర్ యజమానులు కోటగిరి వేణుబాబు, కోటగిరి కిషోర్ బాబు పట్టుపట్టారు. నరసింహనాయుడు సినిమాను వెస్ట్ గోదావరి లో వల్లి పిక్చర్స్ అధినేత నాగశేషు రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు పోటీగా వచ్చిన దేవిపుత్రుడు సినిమాను ఉషా పిక్చర్స్ అధినేత ఉషా బాలకృష్ణ, మృగరాజు సినిమాను తాడేపల్లిగూడెంకు చెందిన విజయలక్ష్మి పిక్చర్స్ అధినేత కే విజయభాస్కర్ రెడ్డి రిలీజ్ చేశారు. కామవరపుకోట ఒక సీ సెంటర్ కూడా కాదు.. అంతకంటే తక్కువ సెంటర్.. పెద్ద సెంటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యి 100, 150 రోజులు ఆడేశాక 6 నెలలు దాటాక కానీ కామవరపుకోటకు కొత్త సినిమాలు వచ్చేవి కాదు. పైగా కామవరపుకోటకు 18 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణం ఉంది.. అక్కడ అన్ని సినిమాలు రిలీజ్ అయ్యేవి.

ఇటు కామవరపుకోటకు 25 కిలోమీటర్ల దూరంలో చింతలపూడి కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కామవరపుకోటలో కొత్త సినిమా రిలీజ్ అయితే ఆడుతుందా.. మహా అయితే 20 రోజులు కూడా సినిమా ఆడదు.. కోటగిరి బ్రదర్స్ రిస్కు చేస్తున్నారా.. అన్న సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు. చివరకు అప్పుడు మంత్రిగా ఉన్న వీరి పెదనాన్న దివంగత కోటగిరి విద్యాధరరావు స్వయంగా రెకమెండ్ చేయడంతో వ‌ల్లీ పిక్చర్స్ కామవరపుకోటలో నరసింహనాయుడు సినిమా రిలీజ్ చేసేందుకు అంగీకరించారు. ఆ రోజుల్లో రూ.1.80 లక్షలకు నరసింహనాయుడు ప్రింట్ కామవరపుకోటలో రిలీజ్ చేసేందుకు ఒప్పందం కుదిరింది.

నెల రోజులపాటు పది రూపాయల ఫ్లాట్ టిక్కెట్ పెట్టారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో నెల రోజులపాటు రోజు నాలుగు ఆటలు హౌస్ పూల్స్ అయ్యాయి. అస్సలు లక్ష్మీ టాకీస్ కాళీ ఉండేదే కాదు. ఏలూరు అంబికా కాంప్లెక్స్ లో రెండు థియేటర్లలో నరసింహనాయుడు సినిమా ఆడుతున్న.. అక్కడ టిక్కెట్లు దొరకని వాళ్ళు బ్లాక్ లో వంద రూపాయలు పెట్టి టికెట్లు కొనని వాళ్లు.. 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కామవరపుకోట లక్ష్మి టాకీస్‌కు వచ్చి పది రూపాయల టికెట్ పెట్టి నరసింహనాయుడు సినిమా చూసి ఎంజాయ్ చేసేవాళ్లు. ఇక్కడ కూడా నెల రోజులు పాటు టికెట్లు దొరకటం గగనంగా ఉంది. అలా కామవరపుకోట చరిత్రలో తొలి రిలీజ్ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కిన నరసింహనాయుడు 50 రోజుల పూర్తి చేసుకుంది.

అదే వేడిలో సెంచరీ కొట్టి 101 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అటు 18 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెం సౌభాగ్య‌లో కూడా 100 రోజులు ఆడింది. జిల్లా మొత్తం మీద 9 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమా కామ‌వ‌ర‌పుకోట ల‌క్ష్మీ థియేటర్లో ఫైనల్ రన్ లో రూ.11 లక్షల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సెంటర్ చరిత్రలో ఇప్పటివరకు ఏకైక 100 రోజుల సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. సినిమా 100 రోజులు ఆడినందుకు గాను నిర్మాత థియేటర్ యాజమాన్యానికి టాటా సుమో కారు బహుకరించినట్టు ప్రచారం జరిగింది. కామవరపుకోట సినీ చరిత్రలో ఇప్పటివరకు వంద రోజులు ఆడిన సినిమా ఏదీ లేదు. ఆ తర్వాత ఇదే థియేటర్లో 2004 సంక్రాంతి కానుకగా మళ్లీ బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ అయ్యి 51 రోజులపాటు ఆడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news