అన్నగారు ఎన్టీఆర్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన 1956లోనే నిర్మాతగా సినీ రంగంలో తన ముద్ర వేసుకున్నారు. తర్వాత.. స్వయంగా ఎన్-ఏ-టీ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై అనేక సినిమాలు చేశారు. ఈ బ్యానర్‌ను పూర్తిగా తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు కోసమే ఏర్పాటు చేయడం గమనార్హం.
అయితే.. అప్పట్లో అన్నగారి దగ్గర పెద్దగా సొమ్ము లేదు. దీంతో హాస్యనటుడు రేలంగి సిఫార్సుతో విజయా సంస్త సహకారం తీసుకుని తమ్ముడు త్రివిక్రమరావు కోసం.. అన్నగారు సినిమా చేశారు. దీనిలో ఆయన రూపాయి పారితోషికం తీసుకోకుండానే కథ కూడా తనే సిద్ధం చేయడం గమనార్హం. అదే.. 1959లో వచ్చిన పగటి చుక్క-రేచుక్క. ఇది బాగానే ఆడింది.
ఈ చిత్రం భారీ తారాగణంతో పెద్దపెద్ద సెట్టింగులతో రూపుదిద్దుకునేలా అన్నగారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎక్కడా రాజీ పడలేదు. భారీ సెట్టింగులు, రెహమాన్ ఫోటోగ్రఫీ విశేషంగా ఆకర్షించాయి. ఈ సినిమాలో ఎస్.వి.రంగారావు నటనకు దీటుగా శౌర్యాన్ని ప్రదర్శించారు ఎన్.టి.రామారావు. యువరాణిగా అప్పటి ఎవర్ గ్రీన్ నటి షావుకారు జానకి నటించారు.
ప్రణయ గీతాలతో ఈ సినిమా అందరినీ మైమరపింపజేసింది. ఈ చిత్రం ‘‘రాజ సేవై’’ అనే పేరుతో తమిళంలో కూడా నిర్మించారు. అక్కడ మాత్రం కాసుల వర్సం కురిపించింది. తెలుగులోకంటే కూడా.. తమిళ వెర్షన్‌లో భారీగా సొమ్ము రాబట్టడంతో అన్నగారు.. తన పెట్టుబడి తీసుకుని.. తమ్ముడికి మిగిలింది ఇచ్చేయడం గమనార్హం.