గోవాలో సంతోషం పత్రిక అధినేత, మూవీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి నిర్వహించిన సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ పెద్ద రసాభసాగా మారిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై అటు సురేష్ క్లారిటీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే అల్లు అరవింద్ రంగంలోకి దిగి అసలు సురేష్ మా ఫ్యామిలీలో ఎవ్వరికి పీఆర్వో కాదని కామెంట్ చేయడం ఇలా హాట్ హాట్‌గా ఈ ఇష్యూ మారింది. కన్నడ స్టార్లకు అవమానం జరిగిందంటూ వస్తోన్న వార్తలన్నీ అబద్ధాలు అంటూ సురేష్ కొండేటి క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ అయ్యింది. సురేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో నిర్మాత దామోదర్ ప్రసాద్ సురేష్‌కు కౌంటర్ ఇచ్చారు. కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై కన్నడ ఇండస్ట్రీతో పాటు కన్నడ సినీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలు పెట్టారు. చివరకు వారు టాలీవుడ్‌ను దారుణంగా ఆడి పోసుకుంటున్నారు.
చివరకు సురేష్ మెగాస్టార్ పీఆర్వో, మెగా ఫ్యామిలీ పీఆర్వో అన్న ప్రచారంతో ఈ వార్తలు చిరంజీవి వరకు వెళ్లడం.. తమ ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే అల్లు అరవింద్ రంగంలోకి దిగి.. అతడు మా ఫ్యామిలీలో ఎవ్వరికి పీఆర్వో కాదని.. అతడికి మాకు సంబంధం లేదని చెప్పారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు సినీ పరిశ్రమకు మచ్చ తీసుకొచ్చిన గోవాలోని సంతోషం అవార్డ్స్ నిర్వహణను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (టీఎఫ్‌సీసీ) కూడా ఖండించింది.
దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ లేఖ కూడా రిలీజ్ చేసింది. టీఎఫ్‌సీసీ సెక్రటరీ అయిన సీనియర్ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడారు. ఈ ఫంక్షన్‌లో అల్లు అరవింద్‌తో పాటు కొందరు తెలుగు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారని.. అక్కడ నిర్వహణ ఏ మాత్రం సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన మండిపడ్డారు. తామే ముందుకు వచ్చి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశామని.. నిర్వహణ విషయంలో పొరపాట్లు సహజమే అంటూ సురేష్ ఇచ్చిన వివరణలో పూర్తిగా నిజాలు లేవని అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన బయట పెట్టారు.
కరెంటు విషయంలో పేమెంట్ ఇవ్వక వాళ్లు కరెంట్ కట్ చేస్తూ ఉన్నారని… అలా జరుగుతోన్న టైంలోనే సురేష్ ఈవెంట్ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారని.. కనీసం ఫోన్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని తెలిపారు. అందుకే అల్లు అరవింద్‌తో కలిసి అక్కడ పరిస్థితి మామూలు చేసే ప్రయత్నం చేశారట. అవార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో గోవా గవర్నమెంట్ కూడా తెలుగు సినీ పరిశ్రమపై ఆగ్రహంతో ఉందని… దీనివల్ల భవిష్యత్తులో తెలుగు సినిమా షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.