రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్న సలార్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో దిగిపోయింది. సినిమాపై ఉన్న బజ్ నేపథ్యంలో అర్థరాత్రి నుంచి ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. నైజాంలో 20 థియేటర్లలో అర్ధరాత్రి షోలకు ప్రత్యేక అనుమతులు వచ్చాయి. ఆంధ్రాలో అయితే అన్ని సెంటర్లలోనూ.. చివరకు సీ సెంటర్లలో కూడా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమాకు యునానిమస్‌గా సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.
మిడ్ నైట్ షో అలా పూర్తయిందో లేదో.. ఎక్కడ చూసినా ప్రభాస్ అభిమానులతో పాటు, తెలుగు సినిమా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర రన్ ప్రారంభించింది. తొలిరోజు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా సింపుల్‌గా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికే రూ.500 కోట్లు దాటేస్తుందని కేజిఎఫ్ 2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల వసూళ్లను కూడా సలార్ ఈజీగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఇంకా చెప్పాలి అంటే కేజిఎఫ్ 1,2.. పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలు అన్నీ కలిపితే సలార్ ఫస్ట్ పార్ట్ లెక్క అని సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే కేజిఎఫ్ సిరీస్ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్.. సలార్ సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీ రేంజ్‌ను మరోసారి దేశవ్యాప్తంగా చాటి చెప్పాడని ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రశాంత్ నీల్‌కు వెంటనే గుడి కట్టేయాలంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు థియేటర్లలో సలార్ జోరుకు బ్రేకులు పడేలా లేవు.