టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఈ దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. కాగా మూడు నెలల గ్యాప్ లోనే రవితేజ ఈగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పీపుల్స్ మీడియా నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఆధ్యంతం ఆసక్తిగా ఉంది.
ఒక సినిమాకు ఎంత స్పాన్ ఉంటుంది అన్నదానికి లెక్కేలేదు. ఈగిల్ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ చాలా పెద్ద స్పాన్లో రాసుకున్నది అని తెలుస్తోంది. ఎక్కడో గ్రామంలో మొదలై.. నక్సలైట్లు, టెర్రరిస్టులు, ఆయుధాలు, మాఫియా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో షేడ్‌లు ఈ కథలో కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో బరువైన కథ మనకు కనిపిస్తోంది. సన్నివేశాలలో స్టైల్ కనబడుతోంది. ట్రైలర్ కొత్తగా ఉంది అనేకన్నా.. చాలా ఆసక్తిగా ఉంది. సినిమాలో మొత్తానికి ఏదో ఉంది.. కచ్చితంగా చూడాల్సిందే అనేలా ఉంది.
లుంగీ వేసుకున్న రవితేజ గెటప్ బాగుంది. ట్రైలర్‌కు సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు, డైలాగులు హైలైట్ అయ్యాయి. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడుగా తానేంటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు.. అన్న అంచనాలు ట్రైలర్ చెప్పేసింది. మణిబాబు, కార్తీక్ కలిసి అందించిన డైలాగుల్లో కొన్ని మెరుపులు కూడా ట్రైలర్‌లో మెరిసాయి. ఏది ఏమైనా ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని అయితే పెంచేసింది.
కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈగిల్ సినిమా మంచి కిక్కిస్తుందని అనిపిస్తోంది. కొత్తదనం ఉన్న సినిమాలను ఈ యేడాది ప్రేక్షకులు ఆదరించారు.. ఈగిల్ సినిమా కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులకు మత్తెక్కిస్తుంది.. అనేలా ఉంది. సంక్రాంతి గుంటూరు కారం, నా సామిరంగా, హనుమాన్, సైంధవ సినిమాలకు పోటీగా బరిలోకి దిగుతున్న ఈగిల్ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ కొడతాడో చూడాల్సి ఉంది.