నందమూరి కుటుంబంలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మధ్య సరైన సఖ్యత లేదన్న వార్తలు గత ఐదారు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సరైన సంబంధాలు లేవు. మధ్యలో హరికృష్ణ మృతి చెందినప్పుడు మాత్రం వీరిద్దరూ కాస్త దగ్గర అయినట్టు కనిపించారు. ఆ టైంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ట్రైలర్ ఫంక్షన్‌కు కూడా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎడమొకం పెడమొకం అన్నట్టుగానే కథ నడుస్తోంది.
ఇక గత ఏడాది ఏపీలో వచ్చే ఎన్నికల ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తారా.. అన్న ప్రశ్నకు బాలయ్య ఆన్సర్ ఇస్తూ ఎవరిని బొట్టు పెట్టి పిలవం అంటూ.. పరోక్షంగా ఎన్టీఆర్‌ను ఉద్దేశించే ఆ మాట అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. సరే ఎన్టీఆర్, బాలయ్య మధ్య అంత సఖ్యత లేదన్నది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటేనే కొంతవరకు అర్థం అవుతుంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు హరికృష్ణ మరో తనయుడు.. ఎన్టీఆర్ సోదరుడు.. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య పేరు ప్రస్తావించకపోవడంతో.. కళ్యాణ్ రామ్‌కు, బాలయ్యకు మధ్య కూడా అంత సఖ్యత లేదా అన్న సందేహాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న డెవిల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ఏ ఎం బి మాల్లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కళ్యాణ్ రామ్ చివరిలో జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హరికృష్ణ.. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. బాబాయ్ బాలయ్య పేరు ప్రస్తావనకు రాకుండా జాగ్రత్తపడ్డారు. గతంలో కళ్యాణ్ రామ్ ప్రసంగాలలో చివరలో జై బాలయ్య నినాదం మారుమోగేది. ఇప్పుడు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా జై బాలయ్య నినాదం మారుమోగుతుంది.
ఇలాంటి టైం లో కళ్యాణ్ రామ్ నోటివెంట జై ఎన్టీఆర్, జై హరికృష్ణ అన్న మాటలు రావడంతో.. బాలయ్య పేరు ప్రస్తావన తేకపోవటంతో కళ్యాణ్ రామ్ తోను బాలయ్యకు అంత సానుకూలత లేదా అన్నది పలువురు లేవనెత్తుతున్నారు. ఇక దివంగత తారకరత్న మృతి చెందినప్పుడు కూడా బాలయ్య.. ఈ ఇద్దరు అన్నదమ్ములను పెద్దగా పట్టించుకోలేదు అన్న ప్రచారం ఎన్టీఆర్ అభిమానుల నుంచి వ్యక్తం అయింది. ఏది ఏమైనా నందమూరి హీరోలు అందరూ కలిసి సినిమాలు చేసుకుంటూ ఉంటే.. నందమూరి అభిమానుల ఆనందం వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.