దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా నటించిన చిత్రం కటకటాల రుద్రయ్య. ఇది సూపర్ హిట్ మూవీ. విజయ మాధవి సంస్థ ఈ సినిమాను తీసింది. అప్పట్లో వచ్చిన యాక్షన్ చిత్రాల్లో ‘కటకటాల రుద్రయ్య’ ఒక ట్రెండ్ సెట్టర్. 1978 అక్టోబర్ 11న విడుదలైన కటకటాల రుద్రయ్య… బడ్జెట్ రూ.18 లక్షలు. కానీ, సినిమా విడుదలయ్యాక ఏకంగా రూ.75 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్లు కూడా అప్పట్లో రికార్డు సృష్టించాయి. దాసరిని ఎన్టీఆర్ కూడా అభినందించారట.
అయితే.. అసలు దాసరి.. ఈ మూవీని నటశేఖర కృష్ణతో చేయాలని అనుకున్నారు. దీంతో కృష్ణ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఓపికగా ఆయనను కలిసిన దాసరి.. కథ వినిపించారు. దాసరి నారాయణరావు చెప్పిన కథ నచ్చడంతో హీరో కృష్ణ డేట్స్ కూడా ఇచ్చారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు కృష్ణ.. కటకటాల రుద్రయ్య సినిమా నిర్మాత వడ్డే రమేశ్‌కు కబురు చేసి, ‘మీకు ఇచ్చిన డేట్స్ సమయంలోనే నేను మరో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఒక పని చేద్దాం.. ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకూ మీ సినిమాకు పనిచేస్తా. వేరే వాళ్లకు ఒకటి నుంచి రాత్రి 9గంటల వరకూ షూటింగ్ చేస్తా. మీకు ఓకేనా’ అని అడిగారు.
అయితే.. ఈ ప్రతిపాదనకు వడ్డే రమేశ్ అంగీకరించలేదు. ‘అలా కుదరకపోవచ్చు. మీ డేట్స్ ఆ నిర్మాతకు ఇచ్చేయండి. నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటా’ అని చెప్పి వచ్చేశారట. ఇక, కృష్ణ ఇంటికి వెళ్లే దారిలోనే కృష్ణంరాజు ఇల్లు ఉంది. దీంతో సరాసరి అక్కడికి వెళ్లారు. ఆయన, కృష్ణంరాజు మంచి స్నేహితులు కూడా కావడంతో ‘నా కటకటాల రుద్రయ్య చిత్రంలో హీరోవి నువ్వే’ అని చెప్పి అక్కడి నుంచి దాసరి ఇంటికి తీసుకెళ్లారు. విషయమంతా ఆయనకు వివరించారు. దాసరి కూడా సముఖత వ్యక్తం చేయడంతో హీరో కృష్ణ చేయాల్సిన పాత్ర ఇలా కృష్ణంరాజుకు వచ్చింది.