టాలీవుడ్‌లో ప్రతి సంక్రాంతికి నాలుగైదు సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఉంటాయి. గత నాలుగైదు సంవత్సరాలుగా సంక్రాంతి సినిమాలకు థియేటర్ల కోసం పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ఏడది చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా థియేటర్ల కోసం ఎలాంటి యుద్ధాలు జరిగాయో..? ఎలాంటి రాజకీయం జరిగిందో..? చూసాం. అటు దిల్ రాజు తమిళ్ హీరో విజయ్‌తో నిర్మించిన వారసుడు సినిమాకు ఎక్కువ ధియేటర్లు కేటాయించే ప్రయత్నాలు కూడా జరిగాయి.
ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా థియేటర్ల రాజకీయంలో రవితేజ ఈగిల్ సినిమా బలి కాబోతుందన్న గుసగుసలు నడుస్తున్నాయి. జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, హనుమన్ సినిమాలు ఉన్నాయి. 13న వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగిల్ సినిమాలో రిలీజ్ అవుతున్నాయి. అంటే 12న రెండు సినిమాలు కలిపి రెవెన్యూ షేర్ చేసుకోవాలి. 13న ఏకంగా నాలుగు సినిమాలు కలిపి రెవెన్యూ షేర్ చేసుకోవాలి. అంతేకాదు ఈ నాలుగు సినిమాలు ధియేటర్లు షేర్ చేసుకోవాలి.
గుంటూరు కారం.. మహేష్ బాబు సూపర్ స్టార్ కావటంతో ఆ సినిమాకు దక్కే థియేటర్ల విషయంలో ఇబ్బంది లేదు. హనుమాన్‌కు ఎప్పుడో డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు కట్టి మరీ థియేటర్లు బుక్ చేసుకున్నారు. ఇక వెంకటేష్ సైంధవ్ సినిమాకు సురేష్ బాబు, ఏషియన్ సునీల్ లాంటి బడా డిస్ట్రిబ్యూటర్ల అండదండలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ నాలుగు సినిమాల పోటీ మధ్యలో రవితేజ ఈగిల్ సినిమా నలిగిపోతుంది. ఈ సినిమాకు కూడా థియేటర్లో అగ్రిమెంట్ జరుగుతున్నా అనుకున్న స్థాయిలో థియేటర్లు దక్కటం లేదని తెలుస్తోంది.
ఈ సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే నిర్మాతలు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గకుండా రేస్‌లో ఉండడంతో పాటు అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఈగిల్ సినిమాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దక్కటం లేదని సంక్రాంతి సినిమాల రాజకీయంలో.. రవితేజ సినిమా నలిగిపోతుందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.