తెలుగు సినిమా పరిశ్రమలో హిట్లు కంటే ప్లాపులు ఎక్కువ. ఈ యేడాది రిలీజ్ అవుతున్న సినిమాలలో కనీసం 10% విజయాలు ఉంటే గొప్ప. ఏడాది మొత్తం మీద ఐదు నుంచి ఆరు సినిమాల మాత్రమే భారీ లాభాలు కళ్ళ జూస్తూ ఉంటాయి. 2023 కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ యేడాది కూడా ఎన్నో హిట్లు, ఎన్నో ప్లాపులు వచ్చాయి. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ఫ్యామిలీకి చెందిన హీరోలు 11 మంది వరకు ఉన్నారు. సగటున నెలకు మెగా ఫ్యామిలీ హీరోల నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతోంది.
నిజం చెప్పాలంటే టాలీవుడ్ ఏపీ, తెలంగాణ థియేటర్లకు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలతో మంచి ఫీడింగ్ ఉంటుంది. అయితే ఈ యేడాది మెగా ఫ్యామిలీ హీరోలు పోటీపడి మరి ఒకరిని మించిన డిజాస్టర్లు ఒకరు ఇచ్చారు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. నిజం చెప్పాలంటే చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయనకు అసలు సిసలు హిట్ సినిమా ఇది. ఇక ఆగస్టులో చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. తమిళంలో హిట్ అయిన వేదాళం సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్‌గా రీమేక్ చేస్తే అతిపెద్ద డిజాస్టర్ అయింది.
చిరంజీవి కెరీర్‌లోనే ఓ ఎపిక్ డిజాస్టర్ గా భోళాశంకర్ నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలిసి నటించిన బ్రో సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. తమిళంలో హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమిక్‌గా.. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లాంటి ఇద్దరు మెగా హీరోలు ఉన్నా కూడా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచిపోయి చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా దాటలేదు. సాయిధరమ్ తేజ్ సోలో హీరోగా చేసిన విరూపాక్ష సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్.
ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవ్‌తేజ్.. శ్రీలీల పేరు చెప్పుకుని ఆదికేశవ సినిమాతో నవంబర్‌లో హంగామా చేసినా డిజాస్టర్ అయింది. ఇక ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన వరుణ్.. అర్జున్ సినిమా చేస్తే.. ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఇలా మెగా హీరోల సినిమాలు ఏవి ఈసారి బాక్సాఫీస్ బరిలో క్లిక్ అవ్వలేదు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ అసలు ఈ ఏడాది తమ సినిమాలు రిలీజ్ చేయలేదు. ఈ ఏడాది తమ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌లు ఇచ్చిన చెత్త రికార్డ్ మెగా హీరోలు తమ ఖాతాలో వేసుకున్నారు.