ఓల్డ్ సినిమాల్లో విలనీ పాత్రలు అంటే.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగభూషణం. ఆ తర్వాతే రావుగోపాలరావు. కానీ, ఇద్దరూ సమ ఉజ్జీలు. అయితే.. ఇద్దరిలోనూ నాగభూషణానికి మరో ప్రత్యకత ఉంది. ఆయన ప్రతి నెలా తొలివారంలో ఏపీకి వచ్చేసి.. రెండు ప్రాంతాల్లో రక్తకన్నీరు నాటకం ఆడిన తర్వాతే.. సినిమాలకు షెడ్యూల్ ఇచ్చేవారు. ఇలా.. ఆయన రక్త కన్నీరు నాటకాన్ని హిట్ చేస్తే.. ఈ నాటకమే.. ఆయనను సినిమాల్లో సూపర్ హిట్ నటుడుగా నిలబెట్టింది. అంతేకాదు..నాగభూషణం అంటే.. ఎవరో ఎవరికీ తెలియదు. కానీ, రక్తకన్నీరు నాగభూషణం అంటే.. ఠక్కున చెప్పేవారట. అలా ఆ నాటకం పేరు తన ఇంటిపేరు అయిపోయిందని నాగభూషణం చెప్పేవారు.
అసలేంటీ నాటకం..?
తెలుగునాట సాంఘిక నాటకాల చరిత్రలో ‘రక్తకన్నీరు’ది ఒక ప్రత్యేక అధ్యాయం. తమిళంలోఉన్న ఈ నాటకాన్నివిద్యార్ధి దశలో ఉన్న నాగభూషణం.. ప్రముఖ రచయిత రచయిత పాలగుమ్మి పద్మరాజుతో తెలుగులో రాయించారు. ‘రక్తకన్నీరు’ నాటకం తొలి ప్రదర్శన 1956 మే నెలలో నెల్లూరులో జరిగింది. సంచలనం సృష్టించింది. తమిళంలో అనుసరించిన పద్ధతినే తెలుగులోనూ ఫాలో అయ్యారు నాగభూషణం. ఈ నాటకం సూపర్ హిట్ కొట్టింది.
ఇక అప్పటి నుంచి ‘రక్తకన్నీరు’ నాటకాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించారో లెక్కే లేదు. ప్రతి ఏడాది నవంబర్ నెల నుంచి జూన్ వరకూ ఏపీలో తిరుగుతూ నెలకు పాతిక ప్రదర్శనలు ఇచ్చేవారు. 1959లో కాకినాడలో అయితే ‘రక్తకన్నీరు’ నాటకాన్ని వరుసగా 14 రోజుల పాటు ప్రదర్శించారు. అప్పటికి నాగభూషణానికి ఇంకా సినిమా గ్లామర్ రాలేదు. ఆ రోజుల్లో నాగభూషణం నెలకొల్పిన రవి ఆర్ట్ థియేటర్స్ సంస్థ మీద మొత్తం 30 కుటుంబాలు ఆధారపడి ఉండేవి.
వాణిశ్రీ, శారద ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించే సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. రేవతి, మీనాకుమారి, సుజాత, ఆదోని లక్ష్మి కూడా ఈ నాటకం ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. 1961 నుంచి 67 వరకూ నాగభూషణం ఏటా రెండు మూడు సినిమాల్లోనే నటించే వారు. మిగిలిన సమయాన్ని ‘రక్తకన్నీరు’ నాటకం కోసం కేటాయించేవారు. ఇలా.. రక్త కన్నీరు నాటకం.. ఆయన నరనరానా నిండిపోయింది.