సీనియర్ ఎన్టీఆర్ 1949లో రిలీజ్ అయిన మన దేశం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రిటిష్ పోలీస్ అధికారిగా చిన్న పాత్రలో కనిపిస్తారు. ఎల్వీ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ సినిమాకు నిర్మాత. విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారత స్వాతంత్ర సంగ్రామం ఈ సినిమా కథకు నేపథ్యం.
తొలి సినిమాతో ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి తిరుగులేని రారాజు అయ్యారు. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల టైటిల్స్‌తో ఆయన తనయుడు బాలకృష్ణ కూడా నటించి హిట్లు కొట్టారు. విచిత్రం ఏంటంటే.. ఎన్టీఆర్ తొలి సినిమా మన దేశం టైటిల్ తో కూడా బాలయ్య ఒక సినిమా చేయాల్సి ఉంది. బాలయ్య నటించిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు ముందుగా మన దేశం టైటిల్ ఫిక్స్ చేశారు. రిలీజ్‌కి ముందు టైటిల్ మార్చారు. ఆ సినిమా ఏదో కాదు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్.
బాలకృష్ణ, విజయశాంతి జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వై. అనిల్ బాబు నిర్మాత. అందాల నటి శ్రీదేవి ఈ సినిమాకు తొలి క్లాప్ ఇచ్చారు. కేవలం నాలుగు నెలలు వ్యవధిలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. అంబర్ పేట పోలీస్ మైదానంలో ఆరు రోజులు పాటు క్లైమాక్స్ సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా తీశారు. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ తొలి సినిమా టైటిల్ మనదేశం అని పేరు పెట్టారు. ఆ తరువాత ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ గా మార్పు చేశారు.
1988 సంక్రాంతి కనుకగా జనవరి 15న రిలీజ్ అయిన ఈ సినిమా చాలా కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ ఆజ్ఞాతంలో ఉన్న దళిత సభ్యులతో చేతులు కలిపి విలన్ ఆట కట్టించడమే ఈ సినిమా కథ. ఈ సినిమాకు చక్రవర్తి బాణీలు అంతగా ఆకట్టుకోలేదు. సామాజిక అంశాలను వాణిజ్య విలువలను సమంగా రంగరించి ఈ సినిమాను దర్శకుడు సుబ్బయ్య తెరకెక్కించారు.