టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని ఫ్యామిలీలు రెండు ఆరేడు దశాబ్దాలుగా వందల సినిమాల్లో నటిస్తూ తెలుగు సినీ అభిమానులను మెప్పిస్తున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా నిలిచారు. ఆ తర్వాత వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి ఆ తర్వాత తరం ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికే వీరిద్దరూ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల నుంచి మూడో తరం హీరోలు కూడా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు, ఇటు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి.
అయితే ఎన్టీఆర్.. ఏఎన్నార్ తనయుడు నాగార్జున కాంబినేషన్లో మాత్రం సినిమాలు రాలేదు. ఏఎన్ఆర్ – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా భార్యాభర్తల బంధం. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్ ఈ సినిమాను జనరంజికంగా రూపొందించింది. బాలకృష్ణ, ఏఎన్ఆర్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఇది. దర్శకనిర్మాత వివి.రాజేంద్రప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. వివి.రాజేంద్రప్రసాద్ ఎవరో కాదు.. ప్రముఖ తెలుగు హీరో జగపతిబాబు తండ్రి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ, ఏఎన్ఆర్ మామ అల్లుళ్లుగా కనిపించారు.
1984 డిసెంబర్ చివర్లో ఈ సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. అక్కినేని సరసన జయసుధ నటించగా.. బాలకృష్ణ కు జోడిగా రజినీ కనిపిస్తుంది. అప్పట్లో బాలకృష్ణ – రజినీ కాంబినేషన్లో 3 – 4 సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏఎన్ఆర్, జయసుధ జోడి.. బాలయ్య, రజిని జోడి ఈ సినిమాలో తెరమీద బ్యూటిఫుల్‌గా కనిపించాయి. ఏఎన్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా దసరా బుల్లోడు సినిమాలో ఆయన ఉపయోగించిన కారును ఈ సినిమాలో బాలకృష్ణ వినియోగించడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. 1985 మార్చి 28న ఈ సినిమా రిలీజ్ అయింది.
ఈ సినిమా కోసం మద్రాస్‌లో ఓ ఫైట్ షూట్ చేస్తుండగా బాలకృష్ణ కాలికి పెద్ద గాయం అయింది. వెంటనే దేవకీ ఆసుపత్రిలో చికిత్స చేసి ఐదు రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి బాలయ్య ఆ ఫైట్ సీన్ పూర్తి చేశారు. అయినా గాయం తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయన లండన్ లోని లివర్పూల్ హాస్పిటల్ కి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇక భార్యాభర్తల బంధం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. భార్యాభర్తల మధ్య అవగాహన తప్పనిసరి.. పంతానికి పోయి తనకు దూరమైన భార్యను ఆమె భర్త ఏ విధంగా దారికి తెచ్చుకున్నాడు.. అన్నదే ఈ సినిమా కథాంశం.