టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో తిరిగి లేని క్రేజ్ వచ్చేసింది. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న ఇండస్ట్రీ రికార్డులు అన్నింటిని తిరగరాసి పడేసింది. మగధీర చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా 100 రోజులు ఆడి వసూళ్లపరంగా దుమ్ము దులిపేసింది.
2009లో మగధీర మానియాతో నాటి ఆంధ్రదేశ్ ఉర్రూతలూగిపోయింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరుగేలేని స్టార్ హీరోగా రామ్ చరణ్ పునాది వేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అగ్రనిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా.. హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అని ఎన్నో సమాలోచనలు జరిపిన రాజమౌళి చివరకు కాజల్ పై ఫోటోషూట్ చేశాక.. ఆమె అయితేనే రాకుమారి పాత్రలో బాగా సూట్ అవుతారని ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ – కాజల్ జోడి కెమిస్ట్రీ తెరపై అదిరిపోయింది. మగధీర సినిమా సూపర్ హిట్ అయ్యాక కాజల్ కొన్నేళ్లపాటు టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మగధీర సూపర్ హిట్ అయిన వెంటనే అదే రామ్ చరణ్ – కాజల్ కాంబినేషన్లో మెరుపు అనే మరో సినిమా కూడా పట్టాలెక్కింది. పవన్ కళ్యాణ్ తో బంగారం లాంటి సినిమా తెరకెక్కించిన తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ఏఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో మెరుపు సినిమా అనుకున్నారు.
షూటింగ్ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. అయితే కథ సరిగా రాలేదన్న కారణంతో మెరుపు సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో మరోసారి రామ్‌చరణ్ – కాజల్ జంటగా కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.