పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే నిర్మాతలకు నరకం కనపడుతోంది. పవన్‌తో సినిమా అంటేనే భయపడిపోతున్నారు. ఎలాంటి నిర్మాత అయినా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తే చాలు.. లాభాలు రాకపోయినా అదో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అలా చెప్పుకునే ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు పవన్. పవన్‌తో సినిమా అంటే రు. 30 – 50 కోట్ల చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి నిర్మాతలకు వస్తోంది.
ఒక్కసారి ఇటీవల కాలంలో పవన్ నటించిన, ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల వివరాలు చూస్తేనే ఇది అర్థమవుతోంది. పైగా పవన్ అన్నీ రీమేకులు దించుతున్నాడు. సినిమాకు హిట్ టాక్ వచ్చినా అప్పటికే ఇతర భాషల్లో ఆ సినిమాను చూసేసిన జనాలు తెలుగులో చూసేందుకు ఆసక్తిచూపడం లేదు. వకీల్‌సాబ్ చేసిన దిల్ రాజుకు పెద్దగా మిగిలింది లేదు. పైగా ఆ టైంలో ఏపీలో టిక్కెట్ రేట్ల ఇష్యూ నడుస్తుండడంతో ఆ సినిమాకు నష్టాలే మిగిలాయి.
భీమ్లానాయక్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఫైనల్‌గా చూస్తే మిగిలింది లేదు. ఆ సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే, రానా, పవన్ ఉన్నా కూడా లాభాలు రాలేదు. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. ఇక మళ్లీ తన మేనళ్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి బ్రో అనే మరో రీమేకు దింపాడు. ఈ సినిమాకు పవన్‌కు ఏకంగా రు. 60 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ అది కూడా… 20 రోజులు మాత్రమే షూటింగ్ చేసినందుకు ముట్టింది.
కట్ చేస్తే సినిమా కొన్న వాళ్లెవ్వరికి లాభాలు రాలేదు. ఇప్పుడు షూటింగ్‌లో ఉన్న మూడు సినిమాల్లో హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం. రత్నంకు కనీసం రు. 60 కోట్ల నష్టాలు తప్పవంటున్నారు. సినిమా తేడా కొడితే ఆయన రు. 100 కోట్లకు మునగడం ఖాయమని టాక్. ఈ సినిమా షూటింగ్‌కు పవన్ రాక, వడ్డీలు పెరుగుతూ, వేసిన సెట్లకు నిర్మాత రెంట్లు కట్టలేక లోపల కుమిలి పోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఉస్తాద్ భగత్‌సింగ్ నిర్మాతలదీ అంతే. ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చారు. ఆ వడ్డీలు వేసుకుంటే చివరకు రూపాయి లాభం కూడా రాదని ముందే తెలిసి దిగారు. అయితే పవన్‌తో సినిమా చేశాం అన్న తృప్తి ఒక్కటే మిగిలేలా ఉంది. ఓజీకి రెమ్యునరేషన్ చాలా ఎక్కువ.. కాల్షీట్లు తక్కువా.. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కూడా డేట్లు ఇవ్వడం లేదు. వచ్చే ఏప్రిల్ లేదా మే తర్వాత అంటున్నారు. ఏదేమైనా పవన్‌తో సినిమా అంటే నిర్మాతలకు కష్టాలు, కన్నీళ్లు, ఆవేదన తప్పా రూపాయి లాభం మిగలడం లేదన్నది వాస్తవం.