టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 1999లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత 2001లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి మంచి విజయం సాధించింది. మళ్ళీ 2003 సంక్రాంతి కానుకగా ఒక్కడు సినిమాతో తిరుగేలేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఆ సినిమా వచ్చిన నాలుగు నెలలకే తేజ దర్శకత్వంలో నిజం సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా ఇడియట్ సినిమాతో తెలుగు కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రక్షిత నటించింది.
సీనియర్ హీరోయిన్ తాళ్లూరి రామేశ్వరి.. మహేష్ బాబుకు తల్లి పాత్రలో నటించారు. టాలీవుడ్ హీరో గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. అలాగే సీనియర్ హీరోయిన్ రాశీ.. గోపీచంద్ ఉంపుడుగత్తిగా నెగిటివ్ పాత్రలో నటించింది. చిత్రం మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన నిజంకు దర్శకుడు తేజ నిర్మాతగా వ్యవహరించగా, ఆర్పి పట్నాయక్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. మహేష్ బాబు.. సీతారాం పాత్రలో నటించారు. ఒక్కడు లాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మహేష్ బాబును ఈ తరహా పాత్రలో ఆయన అభిమానులు ఊహించుకోలేదు.
సినిమా కథలో వైవిధ్యం, డెత్ ఉన్నా ఈ కథ మహేష్ కు ఎందుకో గాని సూట్ కాలేదు. ప్రకాష్‌రాజ్ పోషించిన పోలీసు అధికారి పాత్రకు ముందుగా సీనియర్ నటుడు మురళీమోహన్ ను తీసుకున్నారు. ఆయనపై 70% షూటింగ్ కూడా జరిగింది. కానీ రషేస్ చూసిన తర్వాత దర్శకుడు తేజకు ఆ పాత్రకు మురళీమోహన్ సరిపోరని భావించారు. మళ్ళీ ప్రకాష్ రాజ్‌తో ఆ సీన్లు అన్నీ షూట్ చేశారు. దీనిని మురళీమోహన్ తీవ్ర అవమానంగా భావించారు. తనలాంటి సీనియర్ నటుడికి జరిగిన ఘోర అవమానం అని.. ఆయన టాలీవుడ్‌లో పంచాయితీ పెట్టారు.
అయితే ఇక్కడ తేజ వర్షన్ మరోలా ఉంది. ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇచ్చేసాము.. అయితే ఆయన సినిమాలో ఆ పాత్రకు సూట్ కారని మరో వ్యక్తితో షూటింగ్ జరిపాము అని చెప్పారు. చివరకు ఇది టాలీవుడ్ పెద్దలు పంచాయితీగా మారింది. వారందరూ కలిసి ఈ సమస్యను సెటిల్ చేశారు. నిర్మాతలు ఫిల్మి చాంబర్ దేవాలయానికి కొంత అమౌంట్ ఇవ్వాలని.. మురళీమోహన్ కోరగా నిర్మాతలు అలాగే చేశారు. అలా మురళీమోహన్.. మహేష్ బాబు సినిమా కోసం పెట్టిన పంచాయితీ అప్పట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.