Newsఅక్కినేని దేవ‌దాస్‌ క్రేజ్ ఎలా ఉండేదో చెప్ప‌డానికి ఈ ఒక్క గొడ‌వ...

అక్కినేని దేవ‌దాస్‌ క్రేజ్ ఎలా ఉండేదో చెప్ప‌డానికి ఈ ఒక్క గొడ‌వ చాలు…!

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన దేవ‌దాసు చిత్రం ఏళ్ల త‌ర‌బ‌డి ఆడింది. ఈ సినిమాలో క‌థ‌కు.. పాట‌లు ప్రాణం పోశాయి. మొత్తంగా ఈ సినిమా అప్ప‌ట్లో అంద‌రికీ పేరు తెచ్చింది. అంటే..సావిత్రి నుంచి అక్కినేని వ‌ర‌కు పాట‌లు పాడిన ఘంట‌సాల నుంచి డైరెక్ట‌ర్ వ‌ర‌కు అంద‌రి క్రేజ్‌ను ఈ సినిమా పెంచేసింది. దీంతో ఎక్క‌డ ఎవ‌రు న‌లుగురు గుమిగూడినా దేవ‌దాస్ పాట‌లే పాడుకునేవారు. రేడియోలు.. గ్రామ‌ఫోన్ల‌లో ఈ పాట‌లే వినేవారు.

ఘంటసాల ప‌రంగా చూస్తే.. ఆయ‌న గాయ‌కుడే అయినా.. ర‌క్త‌క‌న్నీరు నాగ‌భూష‌ణం మాదిరిగా.. గ్యాప్‌లో వ‌చ్చి నాట‌కాలు ఆడేవారు. ఇలా దేవ‌దాసు సినిమా త‌ర్వాత .. వ‌చ్చిన కొద్దిపాటి గ్యాప్‌లో తెనాలికి వ‌చ్చి.. సక్కుబాయి నాటకంలో న‌టించారు. ఘంటసాల ఈ నాట‌కంలో యోగి వేషం వేశారు. ఆయ‌న పాత్ర స్టేజ్‌మీద‌కి.. ‘రంగా రంగా యనండీ’ అన్న పాటతో ఆయన ఎంట్రీ ఇవ్వాలి. అయితే.. ఘంటసాల ఈ నాట‌కంలో న‌టిస్తున్నార‌ని తెలుసుకున్న ప్రేక్ష‌కులు.. రెండు మూడు దృశ్యాలు అయిన దగ్గర్నుంచీ, ‘ఘంటసాల రావాలి, రావాలి’ అని గ‌గ్గోలు పెట్టారు.

నిజానికి నాట‌కంలో సెకండ్ హాఫ్ నుంచే ఘంట‌సాల ఎంట్రీ ఉంటుంది. అయినా.. జ‌నాలు మాత్రం ఘంట‌సాల కోసం ప‌ట్టుబ‌ట్టారు. దీంతో ఈ గోల త‌ట్టుకోలేక .. ఘంట‌సాల ఎంట్రీ ఇచ్చారు. త‌న‌దైన శైలిలో రంగా రంగా.. అంటూ గానం చేశారు. అయితే.. అది నాట‌క‌మ‌ని..అలానే న‌టించాల‌ని ప్రేక్ష‌కుల‌కు తెలిసినా..దేవ‌దాసు మేనియాలో ఉన్న ప్రేక్ష‌కులు.. మాత్రం యోగి వేషంలో ఉన్న ఘంట‌సాల‌ను దేవ‌దాసు పాట‌లే పాడాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

దీంతో ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు ద‌ణ్ణం పెట్టి.. ‘‘బాబూ.. నాటకం జరగనివ్వండి. అయిన తర్వాత, పాటలు పాడతాను. దేవదాసు ఒక్కటే కాదు మీరు అడిగిన పాటలన్నీ పాడతాను“ అని అన్నారు. నాటకం పూర్తి అవుతూనే, ఘంటసాల సినిమా పాటలు, గ్రామఫోన్‌ పాటలూ పాడారు. ఇదీ.. అక్కినేని దేవ‌దాసు క్రేజీ అని అప్ప‌ట్లో ప‌త్రిక‌లు రాశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news