ఆలిండియా సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. అచ్చతెలుగు అమ్మాయి.. దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను ఏలేసింది. ఆమె పక్కన నటించేందుకు తెలుగు సినిమాల్లో ఎంతో మంది హీరోలు క్యూకట్టినట్టే.. బాలీవుడ్‌లోనూ అనేక మంది ఎదురు చూశారు. ఎంతోమంది శ్రీదేవితో నటించేందుకు కాల్షీట్లు సిద్ధం చేసుకున్నా.. చాన్స్ చిక్కని వారు కూడా ఉన్నారు.
అంతేకాదు.. అసలు బాలీవుడ్ హీరోయిన్గానే ఉత్తరాది వారు ఆమెను చూసేవారు. ఆమె తెలుగు అమ్మాయి అని అంటే.. నమ్మేవారు కూడా కాదు. అంతలా బాలీవుడ్‌లో మమేకం అయిపోయిన శ్రీదేవి అక్కడకు ఎలా వెళ్లింది? ఎవరు తీసుకువెళ్లారు? ఎవరు అవకాశం ఇచ్చారు? అనేది ఆసక్తికర విషయం. ఈ విషయంలో తనకు హీరో కృష్ణ సాయం చేశారని.. శ్రీదేవి స్వయంగా చెప్పారు.
ఇక, సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమకి కూడా ఎంతో సేవ చేశారు. ఎన్నో కొత్త సాంకేతికతను కృష్ణ చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. అలాగే హిందీలో ఎన్నో చిత్రాలు నిర్మించారు కూడా. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలా.. ఓ సందర్భంలో హిందీ సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో స్వయంగా కృష్ణ.. శ్రీదేవిని హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు.
ఏముహూర్తాన ఆయన పరిచయం చేశారో .. తెలియదు కానీ.. ఇక, అప్పటి నుంచి శ్రీదేవి వెనుదిరిగి చూసుకోలేదు. చిరంజీవితో నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి కోసం.. నిర్మాత అశ్వనీదత్ ఆమె కోసం.. ఏడాది పాటు ఎదురు చూశారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక, క్షణ-క్షణం సినిమా కోసం కూడా వర్మ.. మూడు మాసాలు వెయిట్ చేశారు. తన ఫేవరేట్ హీరోయిన్ కావడంతో ఆమె కోసం వెయిట్ చేశానని ఆయనే చెప్పుకొచ్చారు. ఇవన్నీ.. బాలీవుడ్‌లో శ్రీదేవి బిజీగా ఉండడమే కారణం. దటీజ్ శ్రీదేవి.