టాలీవుడ్ యంగ్ కాంట్రవర్సీ హీరో విశ్వక్సేన్ అందాల తార నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ ఫార్చున్ ఫర్ సినిమా సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమా స్టోరీ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే.. ఏలూరు జిల్లాకు చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బయోపిక్ అని ప్రచారం జరుగుతుంది. చింతమనేని పాత్రలో విశ్వక్‌సేన్ నటిస్తున్నారని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల టాక్. చింతమనేని జీవితంలో కీలక పరిణామాలను మరియు ముఖ్యంగా ఆయన యువకుడుగా ఉన్నప్పుడు రాజకీయంగా ఎదిగిన తీరు.. జిల్లాలో గ్రూపు తగాదాలు.. అధిపత్య పోరును ప్రత్యేకంగా చూపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
రాజకీయాల్లో ప్రవేశించిన తొలినాళలో ఎదురైన ఇబ్బందులను దాటి చింతమనేని రాజకీయంగా తిరుగులేని హీరోగా ఎదిగిన తీరు.. తెర ముందు అందరికీ వివాదంగా కనిపించే ఆయనలో తెరవెనక ఎలాంటి ? హీరో దాగి ఉన్నాడు.. ఎలాంటి ప్రజాసేవ చేస్తాడు.. కష్టాల్లో ఉన్న వారిని ఎలా ? అదుకుంటాడు.. అన్న అంశాలు కూడా చూపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా నిలిచింది.
ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 8న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అదేరోజు నాని హీరోగా నటించిన హాయ్ నాన్న, నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 28 లేదా 29న రిలీజ్ చేయాలని నిర్మాత నాగ వంశీ భావిస్తున్నారు. మరి నిజంగా ఇది చింతమనేని ప్రభాకర్ బయోపిక్ అయితే చింతమనేని మరోసారి తెలుగు మీడియా, సోషల్ మీడియాలో సంచలనం అవుతారనటంలో సందేహం లేదు.