ఆమె తెలుగు సినీ రంగానికి తల్లి
లాంటిది! ఎందుకంటే.. అనేక సినిమాల్లో అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని కి తల్లి పాత్రల్లో నటించింది. పలు సినిమాల్లో అయితే.. క్యారెక్టర్ పాత్రల్లోనే నటించినా.. సినిమా మొత్తాన్ని డామినేట్ చేసేవారు. ఆమే.. పి. హేమలత. నేటి తరానికి తెలియని ఒక అపురూప నటనాకౌశలం ఆమె సొంతం. కంచుకంఠంతో సినిమాలకు తనదైన శైలిని అద్దారు. కమ్యూనిస్టు భావాలను పుణికి పుచ్చుకున్న హేమలత.. చిన్నవయసులోనే నాటకాల్లోకి వచ్చారు.
ముఖ్యంగా వివాహం తర్వాత.. సినిమా రంగంలోకి వచ్చిన వారు చాలా అరుదుగా ఉంటే.. వివాహం అయిన తర్వాతే.. సినిమాల్లోకి వచ్చిన విదుషూమణి హేమలత. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడలో 1926లో జన్మించిన హేమలత నాటకాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. 14 ఏళ్లకే వివాహం కావడంతో భర్త శేషగిరి రావుతో ఆమె జీవితం ముడిపడింది. అయితే.. ఆయన కూడా నాటకరంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ప్రోత్సహించేవారు.
ఈ నేపథ్యంలోనే ఏలూరు నాటక కళా పరిషత్తులో చేరి.. తర్వాత.. ప్రజానాట్యమండలిలో సభ్యురాలయ్యా రు. ఇక, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అయితే.. సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రలే ఇచ్చారు. కొన్ని కొన్ని సినిమాల్లో మాత్రం విలనీ పాత్రలు కూడా వేశారు. ఆమె నట జీవితంలో గొప్ప మలుపు వాహినీ వారి బంగారు పాప సినిమా. వాహినీ సంస్థలో అవకాశం రావడమే గొప్పగా ఉండే రోజుల్లో ఆ సంస్థలో నటించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
బి.ఎన్.రెడ్డి నిర్మించిన బంగారు పాప సినిమాలో మంగమ్మ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసారు. సుదీర్ఘ ప్రస్తానంలో 200 సినిమాలు చేసిన పి. హేమలత.. నేటి తరం పుట్టక ముందే.. అంటే.. 1976లోనే సినిమాలకు దూరమయ్యారు. సూర్యాకాంతంతో పోటీ పడి రెమ్యునరేషన్ తీసుకునేవారట. అయితే.. ఆమె సినిమాల నుంచి దూరమయ్యాక.. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి.. హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేరిపోయారు.
దీనికి కారణం.. ఉన్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు సరిగా చూసుకోలేదనే వాదన ఉంది. ఏదేమైనా.. చివర దశలో ప్రశాంతంగానే వెళ్లిపోయారని చెబుతారు. కానీ, ఎక్కడా ఆమె మరణానికి సంబంధించిన వార్త రాకపోవడం గమనార్హం. ఆమె అలానే ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవాలని కోరుకున్నారట.