తెలుగు సినీ ప్రపంచంలో ఎవరి ఆస్తులు ఎక్కువ? అంటే.. రెండు మూడు తరాల నుంచి ఇండస్ట్రీని శాసిస్తున్న అక్కినేని, ఎన్టీఆర్ వంటి వారి పేర్లు ముందు చెబుతారు. ఇది సహజం కూడా. ఇక, ఆ తర్వాత.. చిరంజీవి పేరు కూడా ఉంటుంది. కానీ, వాస్తవం ఏంటంటే.. తన కుటుంబం నుంచిఎవరినీ తెరమీద ప్రోత్సహించని శోభన్ బాబు ఆస్తులే ఇప్పటికీ ఎక్కువంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది నిజం కూడా! ఇతర నటీనటులకు.. ఆయనకు ఉన్న తేడా ఇదేనట. ఆయన చాలా ముందు చూపుతో వ్యవహరించి.. ఆస్తులను భద్రత పరుచుకున్నారనేది ఇండస్ట్రీ టాక్.
భూమి పెరగదు. కానీ, జనాభా పెరుగుతుంది. కాబట్టి భూమిపై పెట్టుబడి పెడితే.. అది రేపు నాలుగింతలవుతుంది! అనేది శోభన్‌బాబు నమ్మిన సిద్ధాంతం. దీంతో ఆయన తనకు వచ్చిన రెమ్యునరేషన్‌లో సింగ భాగాన్ని ఆయన భూములపై పెట్టుబడిగా పెట్టారు. అంతేకాదు.. ఈవిషయంలో అవసరమైతే.. కొందరి నుంచి రుణాలు కూడా తీసుకుని తర్వాత తీర్చేశారట. ఇలా.. ఆయన చెన్నైలోని దాదాపు సగం నగరంలో ఆస్తులు కలిగి ఉన్నారనేది ఇండస్ట్రీ టాక్. ద్రాక్ష తోటల నుంచి పొలాల వరకు.. శోభన్‌బాబు కొనుగోలు చేసేవారు.
ఇలా అప్పట్లో లెక్కలేనన్నిస్థలాలు.. పొలాలు కొనుగోలు చేయడం శోభన్‌బాబు ముందు చూపునకు నిదర్శనమని ఆయనతో నటించిన వారు చెబుతారు. అయితే.. అప్పట్లో ఎందుకు ఇలా చేస్తున్నాడు? అని వారంతా ఆశ్చర్యపోయేవారట. ఇన్ని కొని ఏం చేస్తావని కూడా అడిగేవారట. కానీ, భూమిపై పెట్టిన సొత్తు రెట్టింపు అవుతుందే కానీ.. ఎప్పుడూ.. నష్టపరచదని.. ఇది భవిష్యత్తులో పెద్ద ఆస్తి అవుతుందని శోభన్‌బాబు చెప్పినట్టే ఇప్పుడు ఆయన ఆస్తి విలువ.. అటు తమిళ, ఇటు తెలుగు ఇండస్ట్రీల్లో ఉన్న వారి ఆస్తుల కంటే ఎక్కువని అంటారు.
అంతేకాదు.. అనేక మంది అప్పట్లో శోభన్‌బాబును సినిమాలు తీయాలని.. స్టూడియో కట్టాలని కూడా ఒత్తిడి చేసేవారట. వీరిలో కృష్ణ, ఎన్టీఆర్ వంటివారు కూడా ఉన్నారని అంటారు. అయితే.. శోభన్‌బాబు మాత్రం వీటి జోలికి రాలేదు. అంతేకాదు.. తన కుమారుడు కరుణాకర్‌ను కూడా ఇండస్ట్రీవైపు రానివ్వలేదు. కేవలం భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపైనే శోభన్‌బాబు దృష్టి పెట్టారు. దీంతో ఆయా ఆస్తులే ఇప్పుడు కొండంత చేరుకున్నాయని.. ఎవరూ సంపాదించలేనంత ఆస్తులు పోగేశారని అంటారు.