ఇది నిజానికి చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. సినీ తెరపై నవ్వులు పూయించి.. ఆయన కనిపిస్తేనే చాలు.. నవ్వుల మూటలు మోసుకొస్తారనే పేరు తెచ్చుకున్న ఓల్డ్ కమెడియన్ ఆర్టిస్ట్ రేలంగి వెంకట్రామయ్య జీవితాన్ని తీవ్ర నిరాశకు, నిస్పృహకు.. గురి చేసిన విషయం. ఆయన సినీ రంగంలో ఓ వెలుగు వెలిగారు. అన్నగారు ఎన్టీఆర్, అక్కినేనితో అనేక సినిమాల్లో నటించారు. వారితో సమానంగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు.
అదేసమయంలో ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక, ఆయన కుటుంబం విషయానికి వస్తే.. ఒకే ఒక్క కుమారుడు పేరు సత్యనారాయణ. ఈయన ఇప్పుడు లేరు. కానీ, ఆయన జీవించి ఉన్న కాలంలో సినీమా రంగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఓ సినిమాలో నటించారు కూడా. అయితే.. రేలంగి సినిమా ఫీల్డ్‌లో ఉన్న కష్టనష్టాలు వివరించి.. కుమారుడిని సినిమా రంగానికికాకుండా.. సొంతగా ఒక సినిమా హాల్ కట్టించి.. దానిని చూసుకోమని చెప్పారు.
అయినా.. కూడా నిర్మాతగా అయినా.. పనిచేస్తానంటూ.. సత్యనారాయణ పట్టుబట్టి ఒకటి రెండు సినిమాలు చేశారు. ఇక, ఈ క్రమంలోనే రేలంగి తన వద్ద ఉన్న డబ్బుతో చెన్నైకి నడిబొడ్డున ఉన్న.. ఓ స్థలాన్ని సుమారు 36 ఎకరాలు కొనుగోలు చేశారు. దీనిని తన కుమారుడి పేరుతో రాశారు. ఇది కూడా.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడకు చెందిన బ్రహ్మయ్య అండ్ కంపెనీ ఆడిటర్లతో తన ఆస్తికి సంబంధించిన లెక్కలు చూపించి ఈ స్థలాన్ని కొన్నారు. ఎక్కడా తేడా రాకుండా.. ఎవరూ మోసం చేయకూండా పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.
కానీ, ఇదేస్థలాన్ని సత్యనారాయణ నుంచి విజయా సంస్థకు చెందిన వారు కొంత భూమి లీజుకు తీసుకు న్నారు. ఆ సమయంలోనూ పక్కాగా పట్టా రాయించారు. అనూహ్యంగా ఇది తిరగబడింది. 50 ఏళ్లకు రాసుకున్న లీజు ప్రకారం తమకు కూడా ఇందులో వాటా ఉందంటూ.. విజయా సంస్థకు చెందిన వారసులు కోర్టులో కేసు వేశారు. అంతేకాదు.. ఈ గార్డెన్‌కు వారి పేరు కూడా పెట్టుకున్నారు. ఇప్పటికీ.. విజయా గార్డెన్ అని రాసి ఉన్న ముఖ ద్వారా చూడొచ్చు.
కానీ, వెనక్కి వెళ్తే.. దానికి రేలంగి వెంకట్రామయ్య గార్డెన్ అని రాసి ఉంటుంది. ఈ కేసు ఇప్పటికీ తేలలేదు. కోర్టులో గత 60 ఏళ్లుగా నలుగుతూనే ఉంది. రేలంగి దిగులుతో మృతి చెందడానికి ఇదే కారణమని అంటారు. సత్యనారాయణ కూడా లేరు. కానీ, ఆయన పిల్లలు మాత్రం కోర్టు విచారణకు ఇప్పటికీ హాజరవుతున్నారు. ఇదీ సంగతి.