సినిమాల్లో రాజకీయాలు ఇప్పుడు కామన్. డైలాగులు కూడా దాదాపు ఒక రాజకీయ నేతను దృష్టిపెట్టుకుని రాస్తున్నవే. ఇక, ఎన్నికలు వచ్చాయంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా.. ప్రత్యర్థులు, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్నవారు కూడా సినిమాలు చేస్తున్నారు. ఇవి సక్సెస్ కూడా అవుతున్నాయి. అయితే.. ఎన్నికల్లో ఇవి ప్రభావం చూపించే అవకాశం ఎంత? అనేది మాత్రం చెప్పడం కష్టం.
ఈ తరహా సినిమాలు అన్నగారి కాలంలోనూ వచ్చాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ వర్గంగా ఉన్న కొందరు నటులు సినిమాలు తీశారు. తర్వాత.. చిత్రంగా వారు అన్నగారికి జై కొట్టారు. ఇది వేరే సంగతి. ఇలా వచ్చిన సినిమాల్లో ప్రజలు బాగా ఆకర్షించింది… మండలాధీశుడు. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ కూడా జరిగింది.
అయితే.. దీనికి కౌంటర్‌గా సినిమా చేయాలని అన్నగారిపై వత్తిడి వచ్చింది. పార్టీ నాయకులు బుచ్చయ్య చౌదరి, పరిటాల రవివంటి వారు.. సినిమా తీయాలని అన్నగారిని వత్తిడి చేశారు. కానీ, అన్నగారు ఒప్పుకోలేదు. సినిమా సినిమాగానే ఉండాలి. అది 24 ఫ్రేమ్స్. కేవలం రాజకీయాలను సినిమా చేయడం సరికాదు.. అని తెగేసి చెప్పారు. అంతేకాదు.. తన సినిమాలో రాజకీయ నేతలను ఉద్దేశించి పరుషంగా రాసిన డైలాగులను డిలీట్ చేయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే.. ప్రజా ఉద్యమాలు.. నిరసనలను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాల్లో మాత్రం అన్నగారు నటించారు. అయితే.. అవి కూడాసందర్భోచితంగా పదిమందికీ మేలు చేసేలా ఉండేలా తీయాలని సూచించారు. ఇలా.. సి. నారాయణరెడ్డి రాసిన తెలుగు జాతి మనది పాటలో అన్నగారు జీవం ఉట్టిపడేలా నటించి.. అప్పటి రాష్ట్రాల ఉద్యమాలపై సాగుతున్న అల్లర్లను నిలువరించే ప్రయత్నం చేశారు.