సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చంద్రమోహన్.. అనేక పాత్రలు ధరించారు. అదేసమయంలో హీరోగా అవకా శాలు ఉన్న సమయంలోనే చంద్రమోహన్ క్యారెక్టర్ పాత్రలు, సపోర్టింగ్ పాత్రలు కూడా వేశారు. 1943లో జన్మించిన చంద్ర మోహన్ తన 24వ ఏటనే సినీరంగంలోకి అడుగు పెట్టారు. ఆ వెంటనే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఆయనకు పరిచయాలు కూడా అయ్యాయి. అప్పటికి తెలుగు సినీరంగంలో రారాజుగా వెలుగొందుతున్న అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతోనూ చంద్రమోహన్ స్నేహ బంధం అల్లుకుంది.
వారు కూడా తమ తమ సినిమాల్లో చంద్రమోహన్‌కు పాత్రలు కూడా ఇప్పించారు. అయితే.. ఓ సినిమాలో అవకాశం ఇలా చిక్కి అలా జారిపోయింది. అది కూడా అన్నగారు నటించిన సినిమానే కావడం.. పైగా మల్టీ లాంగ్వేజ్ సినిమా కావడం గమనార్హం. హిందీ సినిమా యాదోంకీ భారత్
కథను తమిళ నిర్మాత ఒకరుకొన్నారు. దీనిని రీమేక్ చేసుకుని నాళై నామధే పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమా ముగ్గురు అన్నదమ్ముల మధ్య తిరుగుతుంది.
దీంతో హీరో కమ్ పెద్దన్నయ్యగా ఎంజీఆర్ నటించారు. ఆయనకు తమ్ముడిగా చంద్రమోహన్ నటించారు.
ఇక, ఇదే సమయంలో తెలుగులోనూ దీనిని తీయాలని నిర్ణయించి.. అన్నగారితో సినిమాను ప్రారంభించారు. ఈ క్రమంలో నిర్మాత చంద్రమోహన్‌ను సంప్రదించి తమిళంలో చేసినట్టే తెలుగు వెర్షన్‌లోనూ తమ్ముడి పాత్ర చేయాలని సూచించారు. దీనికి చంద్రమోహన్ కూడా ఓకే చెప్పారు. అడ్వాన్సుకూడా తీసుకున్నారు.
కానీ, అనూహ్యంగా చంద్రమోహన్ స్థానంలో అన్నగారు బాలయ్యను ప్రవేశ పెట్టారు. దీంతో చంద్రమోహన్ ఛాన్స్ మిస్సయింది. అయినప్పటికీ.. చంద్రమోహన్ ఎన్టీఆర్ అభిప్రాయాన్ని ఆయన నిర్ణయాన్ని గౌరవించారు. తెలుగులో అన్నదమ్ముల అనుబంధం పేరుతో వచ్చిన సినిమా హిట్టయిన విషయం తెలిసిందే.