నటనలో తనకంటూ ప్రత్యేక శైలిని అలవర్చుకుని తెలుగు తెరపై అనేక మంది సీనియర్ నటులతో నటించిన జయసుధ బాగానే సంపాయించుకున్నారు. మహానటి సావిత్రి ప్రోత్సాహంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జయసుధ.. చిన్న చిన్న వేషాలతో ప్రారంభించి.. తిరుగులేని నటిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో ఆమె సంపాయించుకున్న ఆస్తి అంతా ఇంతా కాదని అంటారు. ముఖ్యంగా జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటివారు తెలుగు తెరను దాదాపు రెండు దశాబ్దాల పాటు శాసించారు. ఇలాంటి సమయంలోనే వారు బాగా సంపాయించుకున్నారనే టాక్ ఉంది.
సంపాయించుకోవడమైతే.. సరే, కానీ, వచ్చిన డబ్బును ఏం చేయాలి? ఎలా వినియోగించుకోవాలి? అనే దానిపై ఈ ముగ్గురిలో ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. ఈ క్రమంలోనే శోభన్‌బాబు వీరికి దార్శనికుడు అయ్యారు. రూపాయి సంపాయించుకోవడమే కాదోయ్.. దానిని నిలబెట్టుకోవడం కూడా తెలిసి ఉండాలి! అని వారికి చెప్పేవారట. దీంతో ఆయన చెప్పినట్టే వారు అనేక రూపాల్లో పెట్టుబడులు పెట్టి ఆస్తులు సంపాయించుకున్నారు. అప్పట్లోనే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ద్రాక్ష తోటలు, ఖాళీ స్థలాలను జయప్రద, జయసుధ, శ్రీదేవి కూడా కొనుగోలు చేశారు.
అంతేకాదు.. అప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత కూడా హైదరాబాద్ శివారులో 100 ఎకరాల్లో ద్రాక్ష తోటలు కొనుగోలు చేశారు. ఇప్పటికీ ఇవి ఉన్నాయి. ఇక, జయప్రద విషయానికివస్తే.. ఆమె ఉత్తరాదికి వెళ్లిపోవడంతో వాటిని గొల్లపూడి మారుతీరావుకు అమ్మేశారట. శ్రీదేవి వివాహం అనంతరం.. ఆమె భర్త బోనీ కపూర్ వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ శ్రీదేవి కుటుంబం ఆ ఆస్తులను అనుభవిస్తోంది. ఇక, ఎటొచ్చీ.. జయసుధ విషయంలో మాత్రం ఆస్తులు మిగల్లేదు. దీనికి కారణం.. శోభన్ బాబు మరణం తర్వాత.. వాటిని నిర్వహించే వారు లేకుండా పోవడమేనట.
అప్పటి వరకు శోభన్‌బాబు తన మేనేజర్‌తోనే జయసుధ సహా అనేక మంది ఆస్తులను పర్యవేక్షించారట. ఆయన తర్వాత.. ఇక, ఆస్తులు కబ్జాకు గురికావడం.. వాటిని పట్టించుకునే తీరిక లేకపోవడంతో జయసుధ ఆస్తులను స్థానిక నేతలు, కొందరు స్థానికులు ఆక్రమించుకోవడం ప్రారంభించారు. దీంతో విసుగు చెందిన జయసుధ వాటిని సగం ధరలకే విక్రయించేశారని.. ఇలా దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలను ఆస్తులను సగం రేటుకే విక్రయించారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అయితే.. జయసుధ ఎప్పుడూ తన ఆస్తుల గురించి వెల్లడించలేదు. ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినా అఫిడవిట్‌లో కేవలం 100 కోట్ల ఆస్తులను చూపించారు. అప్పులు 200 కోట్లు చూపించారు.