తెలుగు చలన చిత్ర చరిత్ర ఉన్నంత వరకు ఆయనో అధ్యాయం. ఆయనకు తిరుగులేదు. ఆయన లాం టి నటుడు కూడా ఉండరు. ఆయనే ఎన్టీఆర్. అయితే.. ఎన్టీఆర్ ఈ శిఖరాలు ఎక్కేందుకు ఎంతో కష్టపడ్డా రు. ఒక్క రోజులోనో.. ఒక్క సంవత్సరంలోనో.. ఆయన ఈ ప్రతిభను సాధించలేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కేందుకు ఎంతోహార్డ్ వర్క్ చేశారు. దీనికి మించిన డిసిప్లిన్ పాటించారు. వ్యక్తిగత విమర్శలను పట్టించుకోలేదు. తనపై వచ్చిన గ్యాసిప్‌లను ఆయన పక్కన పెట్టారు.
ఎవరు ఏమన్నా.. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అహరహం శ్రమించారు. ఈ క్రమంలో కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు తలెత్తాయి. కుటుంబానికి సమయం ఇచ్చే తీరిక లేకపోవడంతో పిల్లలకు ఆయన కొన్నాళ్లు దూరమయ్యారు. వారికి ఇచ్చే సమయాన్ని కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. కళామతల్లిసేవలోఅలుపెరుగని కృషి.. నిరంతర క్రమశిక్షణ వంటివి ఎన్టీఆర్‌ను సమున్నత స్థాయికి చేర్చాయనడంలో సందేహం లేదు.
ఇదే విషయాన్ని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ఏం ఎన్టీఆర్.. ఏం ఎన్టీఆర్.. ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి. అర్ధరాత్రి 2 గంటలకు రావడమా.. మళ్లీ తెల్లవారుజామున 5 గంటలకు వెళ్లిపోవడమా! ఇంత హార్డ్ వర్క్ పర్సనాలిటీని నేను ఎప్పుడూ చూడలేదు అని దాసరి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చెన్నైలో దాసరి-ఎన్టీఆర్ ఇళ్లు ఎదురెదురుగా ఉండేవి. దీంతో దాసరి చాలా సార్లు ఎన్టీఆర్‌ను అబ్జర్వ్ చేసేవారట.
ముఖ్యంగా 1970-80ల మధ్య ఎన్టీఆర్ తీరిక లేకుండా కష్టపడిన విషయాన్ని కూడా దాసరి చెప్పుకొచ్చారు. ఎప్పుడు చూడు.ఎన్టీఆర్ సినిమాల గురించే ఆలోచిస్తాడయ్యా. బహుశ అదే ఆయనకు సెకండ్ వైఫ్ అనుకుంటా అని తరచుగా జోక్ చేసేవారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున ఇలా.. ఇంటికి రావడం.. అలా వెళ్లిపోవడం.. ఇదీ.. ఎన్టీఆర్ దైనందిన జీవితంగా సాగింది. ఆ దశాబ్దంలో ఎటు చూసినా ఎన్టీఆర్ సినిమాలే కావడం..అన్నీ హిట్లు కొట్టడం.. మరి ఆశ్చర్యకర విషయం. ఈ విషయాన్ని పేర్కొంటూనే వేటూరి సుందరరామ్మూరి.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు! అంటూ.. గీతాన్ని కూడా రచించడం విశేషం.