హైదరాబాద్ శివార్లలోని ఓ పామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్ 3 కంటెస్టెంట్ హిమజతో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీలను పోలీసులు అరెస్టు చేశారంటూ దీపావళి రోజున వార్తలు గుప్పుమన్నాయి. పోలీసులు జరిపిన ఈ దాడుల్లో పలు మద్యం బాటిల్స్‌తో పాటు మరికొన్ని వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటూ.. మీడియాలో ఒకటే ప్రచారం జరిగింది. మెయిన్ మీడియాలో కూడా ఈ ప్రచారం జరగడంతో అందరూ నిజం అని నమ్మేశారు.
అయితే ఈ వార్తలపై హిమజ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక వీడియో విడుదల చేశారు.
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన హిమజ.. ఫస్ట్ టైం తన కొత్త ఇంట్లో దీపావళి జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇందుకోసం కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది శ్రేయోభిలాషులను కూడా ఆహ్వానించి తామందరం కలిసి పార్టీ చేసుకుంటున్న టైంలో ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారని హిమజ తెలిపారు.
పోలీసులు కూడా మా ఇంట్లో ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో వచ్చి చెక్ చేశారని హిమజ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండడంతో ఏం జరుగుతుందో ? అని తన ఇంట్లో సోదాలు చేశారని.. అంతా చట్టబద్ధంగా జరుగుతుందని తెలుసుకున్నాక పోలీసులు వెళ్లిపోయారని వెల్లడించారు.
అయితే రేవ్ పార్టీని భగ్నం చేసినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె వెల్లడించారు.
తన అరెస్టుపై వార్తలు రావడంతో స్నేహితులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని.. అందరికీ వాస్తవం ఏంటో చెప్పటానికి ఈ వీడియో చేసినట్టు తెలిపారు. నిజంగా తనను అరెస్టు చేసి ఉంటే ఈ వీడియో చేసి ఉండే దానినా ? అని కూడా ఆమె ప్రశ్నించారు. అలాగే తన అరెస్టు వార్తలపై మెయిన్ మీడియాలో కూడా వార్తలు రావడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలియకుండా అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారంటూ ఆమె మండిపడ్డారు