MoviesTL రివ్యూ: అలా నిన్ను చేరి.. ఫీల్‌గుడ్ + ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ

TL రివ్యూ: అలా నిన్ను చేరి.. ఫీల్‌గుడ్ + ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ

టైటిల్‌: అలా నిన్ను చేరి
న‌టీన‌టులు: దినేష్ తేజ్‌, హెబాప‌టేల్‌, పాయ‌ల్ రాధాకృష్ణ‌, ఝాన్సీ, చ‌మ్మ‌క్‌చంద్ర‌, శ‌త్రు త‌దిత‌రులు
మ్యూజిక్‌: సుభాష్ ఆనంద్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆండ్రూ
ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత: కొమ్మాల‌పాటి సాయి సుధాక‌ర్‌
ద‌ర్శ‌క‌త్వం: మారేష్ శివ‌న్‌
రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2023

ప‌రిచ‌యం:
టాలీవుడ్ యంగ్ హీరో దినేష్ తేజ్, హాట్ బ్యూటీ హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా అలా నిన్ను చేరి. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తనయుడు, అదే జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు అల్లుడు అయిన కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా మారి నిర్మించిన సినిమా అలా నిన్ను చేరి. వైవిధ్యమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
విశాఖపట్నం సమీపంలోని ఓ పల్లెటూరికి చెందిన గణేష్‌కు ( దినేష్ తేజ్ ) సినిమాలు అంటే మహా పిచ్చి. ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. ఆ దిశగా ప్రయత్నిస్తున్న సమయంలోనే తన గ్రామానికి చెందిన దివ్య (పాయల్ రాధాకృష్ణ)తో లవ్ లో పడతాడు. ఈ విషయం దివ్య తల్లి కనకం (ఝాన్సీ)కి తెలుస్తుంది. వెంటనే ఝాన్సీ కూతుర్ని తన బంధువైన కాళీ (శత్రువు)కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. దివ్య పెళ్లి విషయం తెలిసినా కూడా గణేష్ ఆ పెళ్లిని ఆపే ప్రయత్నం చేయడు. అదే టైంలో తన లక్ష్యం నెరవేర్చుకోవాలి అంటూ పెళ్లి కంటే కెరీర్ తనకు ముఖ్యమని హైదరాబాద్ వెళ్ళిపోతాడు.

దివ్య దూరమయ్యాక గణేష్ జీవితంలోకి అను (హెబ్బా పటేల్) ఎంట్రీ ఇస్తుంది. అసలు అను ఎవరు..? సినిమా డైరెక్టర్ కావాలనే గణేష్ కల‌ నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా..? ప్రాణంగా ప్రేమించిన దివ్య కు మరొకరితో పెళ్లి జరుగుతుంటే గణేష్ ఎందుకు..? అడ్డు చెప్పలేదు. అను, దివ్యలలో.. గణేష్ ఎవరిని..? పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానమే అలా నిన్ను చేరి సినిమా కథ‌.

విశ్లేష‌ణ :
లక్ష్యం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేసిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి కథే అలా నిన్ను చేరి సినిమా. నేటితరం యువతకు నచ్చే, మెచ్చే అంశాలతో ఫుల్ కమర్షియల్ ఫార్మాట్‌లో దర్శకుడు మారేష్ శివ‌న్‌ ఈ సినిమాను ప్రజెంట్ చేశాడు. సినిమాలో కథ ఆలోచింపజేసేలా ఉంది. ఓ యువకుడి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు ఎలా..? వచ్చారు. కలలు నేరవేర్చుకునే క్రమంలో అతడు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు..? అప్‌క‌మింగ్ డైరెక్టర్లకు ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..? అన్నది ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ ఆఫ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్, సెకండ్ ఆఫ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

విలేజ్ నేపథ్యంలో వచ్చే లవ్ స్టోరీ విజువల్స్ బాగుంటాయి. సినిమా మొత్తం సెల్ ఫోన్స్ లేని టైంలో నడుస్తుంది. దీంతో కాయిన్ బాక్సుల కాలంనాటి ప్రేమ కథ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రేమ కథలతో ఆడియన్స్ మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. దాదాపు ప్రతి సినిమాలోనూ రొటీన్ ప్రేమ కథలు ఎన్నో చూస్తున్నాం. అయితే అందుకు భిన్నంగా ద‌ర్శ‌కుడు మారేష్‌ చేసిన ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయింది. కదా కొన్నిచోట్ల స్లోగా ఉండటం.. కాస్త ఇబ్బంది పెట్టిన ఫీలింగ్ ఉన్నా.. లక్ష్యం కోసం హీరో సాగించే జర్నీ.. ప్రథ‌మార్ధంలో వచ్చే ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి.

కథ ప్రారంభంలో రొటీన్‌గా ఉన్నా దివ్య, గణేష్ ప్రేమలో పడిన తర్వాత మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ప్రపోజ్ చేసే సీన్ సూపర్. సినిమా ఛాన్స్ కోసం హీరో చేసే ప్రయత్నాలు, సన్నివేశాలు రొటీన్‌గా ఉంటాయి. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త డెప్త్ గా రాసుకోవాల్సింది. అయితే సాహిత్యం విషయంలోనూ నటీనటుల నుంచి తనకు కావలసిన నటన రాబట్టుకోవడంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడు. దర్శకుడుగా ఇది తొలి సినిమానే అయినా కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఫ్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా ముగించిన తీరు కూడా చాలా బాగుంది.

న‌టీన‌టుల ప‌నితీరు…
నటినటుల్లో మిడిల్ క్లాస్ యువకుడిగా గణేష్ పాత్రకు హీరో దినేష్ న్యాయం చేశాడు. డ్యాన్సులతో పాటు యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు చక్కగా నటించాడు. సినిమా డైరెక్టర్ కావాలని తపించే నవతరం యువకుడి పాత్రలో అతని నటన బాగుంది. పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్లలో యాక్టింగ్ పరంగా హెబ్బ పటేల్‌కు ఎక్కువ మార్కులు వేయాలి. బోల్డ్ క్యారెక్టర్ లో మెప్పించింది. సెకండ్ హాఫ్ లో సినిమా అంతా హెబ్బా పటేల్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమె పాత్రే సినిమాకు ప్ల‌స్ అయ్యింది. ఇక దివ్య పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అలా ఒదిగిపోయింది. ఇది ఆమెకు తొలి సినిమా అయినా తెరపై చాలా చక్కగా చూడముచ్చటగా నటించింది. దినేష్ పాయ‌ల్ కెమిస్ట్రీ తెరపై చక్కగా పండింది. రంగస్థలం మహేష్, చమ్మక్ చంద్ర, ఝాన్సీ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్గా సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్లస్ అయ్యాయి. కోడిబాయే లచ్చమ్మ పాట తో పాటు మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆండ్రూ సినిమాటోగ్రఫీ సినిమాకు రీచ్‌నెస్ తీసుకువచ్చింది. ఎడిటర్ బాగానే చేసినా కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తే ఇంకా బాగుండేది. యువ నిర్మాత సాయి సుధాకర్ తొలి ప్ర‌య‌త్నంలోనే కొత్తవారితో సినిమా తీసినా చాలా గ్రాండ్ గా విజువల్స్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అత‌డి క‌థ ఎంపిక అత‌డి మంచి టేస్ట్‌ను తెలియ‌జెప్పింది. ఈ విషయంలో సాయి సుధాకర్ ను ప్రత్యేకంగా అభినందించాలి. అలాగూ సినిమాలో నిర్మాత పాత్ర‌లో త‌ళుక్కున మెరిశాడు.

ఫైన‌ల్‌గా…
ఇద్ద‌రు అమ్మాయిలు మ‌ధ్య‌లో ఓ ప్రేమికుడు… తాను ప్రేమించిన అమ్మాయి… త‌న‌ను ప్రేమించే అమ్మాయి.. ఇటు ల‌క్ష్యం ఇందులో చివ‌ర‌కు ఎలా గెలిచాడ‌న్న ఫీల్‌గుడ్ కాన్సెఫ్ట్ స్టోరీయే అలా నిన్ను చేరి. కొంత సాగ‌దీత‌, కొన్ని చోట్ల సినిమాటిక్ లిబ‌ర్టీ ఉన్నా యూత్‌కు, మ‌హిళ‌లు, ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా బాగా క‌నెక్ట్ అవుతుంది.

ఫైన‌ల్ పంచ్ : ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ

అలా నిన్ను చేరి రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news